Tuesday, 3 November 2026

చిన్నారుల ఆరోగ్యం కోసం నులిపురుగుల మాత్రలు 

హైదరాబాద్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నదని, విద్యార్థులు ఆరోగ్యంగా ఎదిగి చదువుతో పాటు మంచి భవిష్యత్తు కలిగి ఉండేలా సర్కారు కృషి చేస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటి తెలిపారు. ఒకటి నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లల్లో రక్తహీనతను నివారించి చురుకుగా, ఆరోగ్యంగా ఎదగడానికి తల్లిదండ్రులు నులి పురుగుల నివారణ మాత్రలను తప్పనిసరిగా ఇప్పించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పాఠశాల విద్యార్థులందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు గుర్తించిన వ్యాధులకు చికిత్సలను కూడా అందిస్తుందని వెంకటి తెలిపారు. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల లోపు 9 లక్షల 52వేల 4 మంది బాల బాలికలు ఉన్నారని, వారందరికీ నులి పురుగుల నివారణ మాత్రలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ ప్రైవేట్‌ ఎయిడెడ్‌ కళాశాలలు పాఠశాలల్లో ఈ మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. చిన్నారులు ఆరోగ్యంగా అభివృద్ధి చెంది ఉన్నత విద్యనభ్యసించాలని జిల్లా విద్యాశాఖాధికారి వెంకట నర్సమ్మ తెలిపారు. పిల్లలకు ఆరోగ్య సూత్రాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలతో పాటు అంగన్‌ వాడీ కేంద్రాల్లో ఈ మాత్రలు పంపిణీ చేస్తున్నామని అన్నారు.