Thursday, 5 November 2026

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి హెచ్ యు జె (టి డబ్ల్యు జె ఎఫ్) ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా

  సికింద్రాబాద్ (జనం సాక్షి )   హైదరాబాద్ జిల్లాలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యు జె) ప్రభుత్వా న్ని డిమాండ్ చేసింది. టి డబ్ల్యూ జే ఎఫ్ పిలుపు మేరకు సోమవారం హైదరాబాద్ కలక్టరెట్ ముందు హెచ్ యు జె అధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరం నలుమూలల నుంచి జర్నలిస్టులు హాజరయ్యారు.
టిడబ్ల్యుజెఎఫ్ అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ,  ఇచ్చిన హామీ మేరకు
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇండ్ల స్థలాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు.
టిడబ్ల్యుజెఎఫ్ ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి సుప్రీం కోర్టులో అడ్డంకులు తొలగిపోయాయని చెప్పారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. హెచ్ యు జె అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో జర్నలిస్టులందరికీ ఇంటి వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇచ్చిన హామీని నిలబెట్టకోవాలని ప్రభుత్వానికి సూచించారు. కార్యదర్శి నిరంజన్ మాట్లాడుతూ, ఇండ్ల సమస్యతో పాటు జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం వినతి పత్రాన్ని హైదరాబాద్ కలెక్టర్ కు నాయకులు అందజేసారు.
 కార్యక్రమంలో జాతీయ నాయకులు ఆనందం, ఫెడరేషన్ నాయకులు సలీమా,జగదీష్,
సీనియర్ జర్నలిస్టులు రాజశేఖర్, రఘు, మధుకర్,… తదితరులు పాల్గొన్నారు.