హైదరాబాద్,సెప్టెంబర్9(జనంసాక్షి): జంటనగరాల్లో వివిధ ప్రాంతాల్లో శనివారం లోక్ అదాలత్‌లు నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్‌లలో భాగంగా హైకోర్టు, నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టు, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లా కోర్టులు, సిటీ సివిల్ కోర్టు, ఎర్రమంజిల్ కోర్టుల్లో వీటిని నిర్వహించారు. జంటనగరాల్లో దాదాపు మూడు లక్షల వరకు పెండింగ్ కేసులు ఉన్నట్లు సమాచారం. ఇరువురు కక్షిదారులు రాజీ మార్గం ద్వారా సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవటానికి ఇది చక్కని మార్గం అని నాంపల్లి సెషన్స్ జడ్జి సుధారాణి అన్నారు. నాంపల్లి కోర్టు పరిధిలో 19 బెంచ్‌ల ద్వారా జాతీయ లోక్‌అదాలత్‌లను నిర్వహిస్తున్నారు. నాంపల్లి కోర్టు పరిధిలో 70వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఆయా కేసులకు సంబంధించి కక్షిదారులను సంప్రదించి కేసులను పరిష్కరించారు.




