“జ్ఞానేంద్రప్రసాద్ మరణం శేరిలింగంపల్లి బిజెపికి తీరని లోటు- శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జ్ గజ్జల యోగానంద్”
శేరిలింగంపల్లి, ఆగస్టు 18( జనంసాక్షి): శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి బిజెపి కన్వీనర్ గా పనిచేస్తూ నియోజకవర్గ పరిధిలో పార్టీ పటిష్టత కోసం ఎంతో కృషిచేసిన జ్ఞానేంద్ర ప్రసాద్ నికార్సైన బిజెపి నేతయని, ఆయన అకాల మరణం శేర్లింగంపల్లి బిజెపికి తీరనిలోటని శేర్లింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జ్ గజ్జల యోగానంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు జ్ఞానేంద్ర ప్రసాద్ దశదినకర్మను పురస్కరించుకొని గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని జ్ఞానేంద్ర ప్రసాద్ నివాసానికి చేరుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో గజ్జల మాట్లాడుతూ జ్ఞానేంద్ర ప్రసాద్ మంచి నాయకుడని, ఆయనతో తనకు చాలా మంచి అనుబంధం ఉన్నదని యోగానంద్ గుర్తు చేశారు. పార్టీలో కలిసి పని చేయడమే కాకుండా, వ్యక్తిగతంగా ఒక గొప్ప మిత్రుణ్ణి తాను కోల్పోయానని గజ్జల ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మిత్రుడు గా తనకు, పార్టీగా బిజెపికి జ్ఞానేంద్రప్రసాద్ సహకారం ఎంతైనా ఉందని, జ్ఞానేంద్రప్రసాద్ మరణంతో తాను ఆ లోటును పూడ్చుకోవడం కష్టమేనని అన్నారు. జ్ఞానేంద్ర ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని, మిత్రుడిగా తనకు, శేర్లింగంపల్లి బిజెపి పార్టీకి ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని గజ్జల ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా జ్ఞానేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతోపాటు వారు మనోధైర్యం కోల్పోవద్దని, బిజెపి పార్టీ అండదండలు వారికి ఎల్లప్పుడూ ఉంటాయని గజ్జల యోగానంద్ హామీని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మధ్య ప్రదేశ్ బీజేపీ ఇంఛార్జి మురళీధర్, రంగారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు బుచ్చి రెడ్డి, ప్రధాన కార్యదర్శి వై. శ్రీధర్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్, ఏకాంత్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, మాణిక్ రావు, రాజు శెట్టి తదితరులు పాల్గొన్నారు.