ముఖ్య అతిథిగా పాల్గొన్న హర గోపాల్..
“అలుపెరగని హక్కుల పతాక బాలగోపాల్” అని కొనియాడిన
ప్రొఫెసర్ హరగోపాల్..
హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 08 జనంసాక్షి :
హక్కుల కార్యకర్త బాలగోపాల్ తనకున్న మేదో సంపత్తిని సంపూర్ణంగా ప్రజల కోసం ఉపయోగించి కార్య క్షేత్రంలో ప్రజలతో మమేకమై నిరంతరం ప్రజా సమస్యల పై పోరాటాలకు పదునుపెట్టేవారని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.
శనివారం హిమాయత్ నగర్ లోని అమృఊ ఎస్టేట్ లోని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యాలయంలో కందాల బాలగోపాల్ 13వ వర్ధంతిని రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో మేధావులు గా చలామణి అయ్యేవారు కొంధరు ఉన్నారు. ప్రజల మధ్యన ఉండే మేధావులు అరుదు అన్నారు.వారి లో బాలగోపాల్ ప్రధముడు అన్నారు.తన శరీరం ఒక సాధనమే గాని ఏనాడు ఆ శరీరం గురించి పట్టించుకోలేదన్నారు.నిరాడంబరమై న జీవితాన్ని గడిపాడన్నారు.హక్కుల ఉద్యమకారుడిగా ప్రజా విలువలు పెంపొందించడానికి ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు.కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగినా ఆ పీడితుల పక్షాన నిలబడి వాదించేవారన్నారు. తెలుగు రాష్ట్రాలలో మేధావులకు విద్యావంతులకు అనేక ప్రజాసంఘాలకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చారన్నారు. సాధారణ మనిషిగా అసాధారణమైన విషయాలపై ప్రసంగించడంలోనూ,విశ్లేషణ చేయడంలోనూ వారి జీవిత ప్రయాణమంతా కొనసాగిందన్నారు. బూటకపు ఎన్కౌంటర్ల పైన రాజ్య హింస పైన అనేక ప్రజావ్యతిరేక సమస్యల పైన నిజ నిర్ధారణ చేసి పాలకుల ముందు ఉంచడంలో బాలగోపాల్ దిట్ట అన్నారు. తన హక్కుల ప్రయాణంలో పాలకులు అనేక ఆటంకాలు కలిగించినా తనను చంపడానికి ప్రయత్నించినా ఎక్కడ వెనకడుగు వేయకుండా హక్కుల పరిరక్షణ కోసం తనవాణిని బలంగా వినిపించేవారన్నారు. ఇదే సందర్భంలో బాలగోపాల్ తో కలిసి తిరిగిన అనేక సంఘటనలను హరగోపాల్ నెమరు వేసుకున్నారు. వారి విలువలను,వారు కొనసాగించిన హక్కుల ప్రయాణాన్ని కొనసాగించాల్సిన బాధ్యత తెలంగాణ విద్యావంతుల వేదిక లాంటి పౌర సమాజ సంస్థలపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా:తిప్పర్తి యాదయ్య,ఉపాధ్యక్షులు ఆర్ విజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ జగధీష్,జంపాల విశ్వ,బైరెడ్డి సతీష్ రెడ్డి,డేగల డి ఎస్ ఎస్ ఆర్ క్రిష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రొఫెసర్ రమ,ఆరేపల్లి విజయ్ , మధన్,రామగిరి ప్రకాష్, పందుల సైదులు మహబూబ్ అలి,కంచి శ్రీనివాస్,హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.




