డబుల్ ఇంజన్లకు ట్రబుల్ ఇస్తున్న తెలంగాణ ఫించన్లు

ప్రజలు తిరగబడతారన్న భయం బిజెపిని వెంటాడుతుంది
అందుకే కేంద్రం నుండి రావాల్సిన నిధులకు అడ్డుపుల్లలు
రుణాలు రాకుండా మోకాలు అడ్డుతుండ్రు
ముక్కు పిండి వసూలు చేసిన పన్నుల్లో వాటా తిరిగి చెల్లించడం లేదు
అయినా కొత్తగా పది లక్షల మందికి ఫించన్లు
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): 25 ఏండ్లుగా బిజెపి ఎలుబడిలో ఉన్న
ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వృద్దులకు ఇచ్చే ఫించన్ కేవలం రూ.750  మాత్రమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.అందులో వికలాంగులకు ఇచ్చే ఫించన్ రూ.600 మాత్రమేనని చెప్పారు.బిజెపి పాలిత రాష్ట్రాలలో మొదటిది ఈ దేశంలో పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో అటు వృద్దులు, వితంతువులతో పాటు వికలాంగులకు ఇచ్చే ఫించన్ మొత్తం కూడ అక్షరాల రూ.600 మాత్రమేనన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్ లో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధ్యక్షతన జరిగిన నూతన ఫింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఇటీవల మంజూరు చేసిన నూతన ఫింఛన్లను సూర్యాపేట మున్సిపాలిటీ, సూర్యాపేట మండల పరిధిలోని లబ్దిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అదే బీజేపీ రెండు దశాబ్దాలుగా పాలిస్తున్న   మధ్యప్రదేశ్ లో అందరికి సర్వ సమానంగా రూ. 600 ఫింఛన్,డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ దొడ్డి దోవన అధికారంలోకి వచ్చిన కర్ణాటక లో కూడా ఇచ్చే ఫించన్ రూ.600 మాత్రమేనని అన్నారు.తెలంగాణ ప్రాంతంలోనూ రాష్ట్రం ఏర్పాటుకు ముందు సాలీనా రూ. 800 కోట్లు ఇస్తుండగా, రాష్ట్రం ఆవిర్భావం తరువాత అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఫింఛన్ల పేరుతో సాలీనా రూ.12,000 కోట్లు చెల్లిస్తుందన్నారు.వృద్దులకు,వితంతువులతో పాటు ఒంటరి మహిళలకు 2,016 రూపాయలు, దివ్వాంగులకు 3,016 రూపాయలు ఫించన్ ఇస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని, ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.డబుల్ ఇంజన్ల పేరుతో రాజకీయం చేస్తున్న కమలనాధులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఫించన్లే ట్రబుల్ ఇస్తున్నాయని విమర్శించారు.ఈ ఫింఛన్లతోటే బిజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ తిరుగుబాటు సంభవిస్తుందో నన్న మీమాంస వారిని వెంటాడుతున్నట్లుందన్నారఅందుకే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని దుయ్యబట్టారు.బ్యాంకుల నుండి రుణాలు మంజూరు కాకుండా అడ్డుకోవడం, కేంద్రం ఇవ్వాల్సిన నిధులను ఇవ్వక పోవడం,రాష్ట్రం నుండి ముక్కు పిండి వసూలు చేసిన పన్నులు తిరిగి రాష్ట్రానికి అందించకుండా మొకాలడ్డుతున్నారని మండిపడ్డారు.అయినా వెనక్కి తగ్గకుండా కొత్తగా మంజూరు అయిన 10 లక్షల ఫించన్లను కలుపుకుని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో46 లక్షల మంది లబ్దిదారులకు ఫించన్లు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు.కొత్తగా మంజూరు అయిన ఫింఛన్లతో కలుపుకుని ఒక్క సూర్యాపేట నియోజకవర్గం లోనే 38,068 మంది లబ్ధిదారులు ఉండగా నెలకు రూ.9.1 కోట్లు సాలీనా రూ.108 కోట్లు చెలిస్తున్న విషయాన్ని ఆయన వెల్లడించారు.2014 నాటికి 28,188 మంది లబ్దిదారులకు నెల ఒక్కింటికీ కేవలం రూ. 3.5 కోట్లు  ఉండగా ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య 38,068  మందికి నెల ఒక్కింటికీ రూ
 9.1 కోట్లు నేరుగా ఫించన్ దారుల అకౌంట్ లో ఎటువంటి పైరవీలకు ఆస్కారం లేకుంటా జమ అవుతున్నాయన్నారు.అంతే గాకుండా ఋణమాఫీ పేరుతో రూ. 25 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిన చరిత్ర సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు.అందుకు భిన్నంగా బిజెపి నేతలు అవాకులు చెవాకులు పేలుతున్న్నారని మండిపడ్డారు.అన్నింటికీ మించి తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో సరఫరా అవుతున్న 24 గంటల నాణ్యమైన విద్యుత్ కూడా బిజెపి పాలకులకు కంటగింపుగా మారిందన్నారు.ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో కరెంట్ సరఫరా కేవలం ఆరు గంటల మాత్రమేనన్నారు.అక్కడ అరనిమిషం కూడ ఉచిత విద్యుత్ ఇవ్వక పోగా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి రీడింగ్ ప్రకారమే రైతాంగం నుండి ముక్కు పిండి మరీ విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు.ఈ బిజెపి పాలనలోనే కదా ఎక్కడో 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా రూ.1100 పై చిలుకు ఎగబాకిందని తెలిపారు. అంతే గాకుండా అటు డీజిల్ , ఇటు పెట్రోల్ ధరల పెరుగుదలకు హద్దు అనేది లేకుండా పోయిందన్నారు.అటువంటి పార్టీ నేతలు ఇటువంటి సంక్షేమాన్ని అడ్డుకోజూస్తున్నప్పుడు సీఎం కేసీఆర్ కు అండగా నిలబడాల్సింది పథకాలు అనుభవిస్తున్న లబ్దిదారులేనని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో
జడ్పీ వైస్ ఛైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, చైర్మన్ పుట్ట కిషోర్, పీడీ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి,వివిధ వార్డుల కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.