Monday, 2 November 2026

డ్రైనేజీ, రోడ్ల పనుల్లో జాప్యం…. అవస్థల్లో జనం

– టీఆర్ఎస్ నగర పాలన అధ్వానం
– మునిసిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే పనులు
– బీజేపీ నగర ప్రధాన కార్యదర్శి బండ రమణారెడ్డి విమర్శలు
నగరంలో రోడ్లు, డ్రైనేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయని బీజేపీ నగర ప్రధాన కార్యదర్శి బండ రమణారెడ్డి విమర్శించారు. సిటీలో రోడ్లన్నీ తవ్వి… పైపు లైన్లు వేస్తున్న పనుల్లో వారాల తరబడి జాప్యం జరుగుతోందని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని… చాలా ఏరియాల్లో పనులు తూతూ మంత్రంగా చేపట్టారని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు పనులు చేపట్టకుండా కాలయాపన చేశారని గురువారం ఓ పత్రికా ప్రకటనలో విమర్శించారు. రోడ్డన్నీ తవ్వి వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఐదేళ్ల పాటు దశల వారీగా చేపట్టాల్సిన పనులను…. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా ప్రారంభించారని మండిపడ్డారు. రోడ్లన్నీ తవ్వడంతో వాహదారులు అవస్థలు పడుతున్నారని అన్నారు. దుకాణాల ముందు తవ్విన గుంతలతో వ్యాపార కార్యకలాపాలు సవ్యంగా సాగడం లేదని తెలిపారు. దుకాణదారులు, అద్దె కూడా చెల్లించుకోలేని పరిస్థితి ఉందని… ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దిగువ ప్రాంతం నుంచి చేపట్టాల్సిన పనులను.. ఎగువ ప్రాంతం నుంచి చేపట్టారని అన్నారు. దీంతో మురుగు నీరంతా పెద్ద ఎత్తున నిలిచిపోతోందని  చెప్పారు. ఒకేసారి ఎక్కువ ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువల తవ్వకాలతో మురుగు నీరు నిలిచిపోయిందని వివరించారు. మురుగు నీటిని మళ్లిస్తూ… దశల వారీగా పనులు చేపడితే… ఈ సమస్య వచ్చేది కాదన్నారు. నిలిచిన మురుగు నీరు… దోమల ఉత్పత్తికి కారణమవుతోందని పేర్కొన్నారు. దోమల నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రోడ్లు,డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలని అన్నారు.