Wednesday, 4 November 2026

తప్పుడు లెక్కల సీఏ

4 వేలు చెల్లించాల్సిన రుణాన్ని 70 వేలుగా మార్చిన వైనం
 అనుమానంతో అకౌంటు స్టేట్మెంట్ తీసిన మహిళా సంఘం సభ్యులు
 సిఏ దొంగ లెక్కలు చేసిందని నిరూపణ
నంగునూరు, అక్టోబర్08(జనంసాక్షి):
తప్పుడు లెక్కలు చేస్తూ మహిళా సమైక్య సంఘాల సభ్యులతో తీసుకున్న రుణం కంటే ఎక్కువ రుణాన్ని చెల్లించాలని ఒత్తిడి తెస్తున్న సీఏ శనివారం రోజున పట్టుబడింది
దీంతో ‘మాకు మహిళా సంఘం వద్దు.. మీరిచ్చే రుణాలు వద్దు’  అని మహిళా సంఘం సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ మహిళా సమైక్య సంఘాలకు రుణాలు అందించడం, వారితో తిరిగి రుణాల చెల్లింపులు సక్రమంగా జరిగేలా గ్రామస్థాయిలో సీఏల పాత్ర ఎంతో కీలకం. అలాంటి బాధ్యత గల వ్యక్తే తప్పుడు లెక్కలు చేయడంతో పలు అనుమానాలకు దారి తీస్తుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే… నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామంలో గ్రామ  సమైఖ్య సంఘం సీఏ చేసిన లెక్కలు పూర్తిగా తప్పుగా ఉన్నాయని గ్రామానికి చెందిన గీతాంజలి మహిళా సంఘం సభ్యులు శనివారం సీఏను నిలదీశారు. వారి సంఘం పేరిట కేవలం 4 వేల రుణం ఉంటే సుమారు 70 వేల రుణాన్ని  చెల్లించాలని సీఏ లెక్కలు చేసి చెప్పిందని వారు తెలిపారు. దీంతో సీఏ చేసిన లెక్కలపై అనుమానాలు వ్యక్తం కావడంతో బ్యాంక్ మేనేజర్ ని సంప్రదించి సంఘానికి చెందిన బ్యాంక్ అకౌంటు స్టేట్ మెంట్ తీయగా… బ్యాంక్ స్టేట్ మెంట్ ఆధారంగా గ్రామ సమైక్య సంఘం సీఏ తప్పుడు లెక్కలు చేసినట్లు తేలిందని సభ్యులు తెలిపారు. ఈ విషయమై పలు మార్లు సీఏను గ్రూప్ సభ్యులు ప్రశ్నించినప్పటికీ ‘నేను చేసిన లెక్కల్లో ఎలాంటి పొరపాట్లు లేవు అవసరమైతే మండల సమైక్య ఆఫీస్ లో  సమాధానం చెప్పుతాను’ అని బదులిచ్చిందని సభ్యులు తెలియజేశారు.దీంతో సభ్యులు మండల ఏపిఎం ఆంజనేయులుకు జరిగిన విషయాన్ని ఫోన్ ద్వారా తెలియజేశారు. వెంటనే స్పందించిన ఏపిఎం ఆంజనేయులు శనివారం గ్రామ సమైక్య సంఘం సీసీ సాయిలుతో సీఏ చేసిన లెక్కలపై విచారణ చేపట్టారు. ఈ విచారణలో సీఏ తప్పుడు లెక్కలు చేసినట్లు గుర్తించామని, సంఘం సభ్యులందరూ 4 వేలు చెల్లిస్తే సరిపోతుందని ఏపిఎం తెలిపారు. దీంతో మహిళా సంఘం సభ్యులు ఆగ్రహంతో సీఏపై విరుచుకుపడ్డారు. ‘సంఘం సభ్యుల్లో ఇద్దరు చెల్లించాల్సిన అప్పును మాతో చెల్లించేలా చూస్తావా’ అని సీఏను నిలదీశారు. మా దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేసి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని చూస్తున్నావా అంటు సీఏపై మిగితా సభ్యులు మండిపడ్డారు. ఇలాంటి అవకతవకలు ఇంకెన్ని చేశావని ఆమెను నిలదీశారు. బ్యాంక్ లో సభ్యులందరూ తీసుకున్న అప్పు తీరకముందే మళ్ళీ సభ్యుల్లో ఒక్కరికీ రుణాలు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. సంఘంలో సభ్యులందరికి అప్పు ఉండగానే సభ్యుల్లో మరొక్కరికి అప్పు ఇస్తే ఇలాంటి అవకతవకలు జరుగుతాయని వారు వాపోయారు. కాగా గ్రామ సమైక్య సంఘం సీఏ తప్పుడు లెక్కలు చేసిందని తేలడంతో గ్రామంలో మిగితా సంఘాల సభ్యుల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.