‘రాజయ్య’ అంశంపై సీఎం సీరియస్
మంత్రులతో ఘాటు వ్యాఖ్యలుహైదరాబాద్: ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా ప్రవర్తిస్తే, ఎవరినైనా పక్కన పెట్టాల్సిందేనని సీఎం కేసీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. పలువురు మంత్రులతో గురువారం క్యాంపు కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. మంత్రులంతా సొంత జిల్లాలకు వెళ్లి స్వైన్ ఫ్లూపై సమీక్షలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ తదితరులతో పాటు ఉప ముఖ్యమంత్రి రాజయ్య కూడా భేటీలో పాల్గొన్నారు. సీఎం తొలుత స్వైన్ ఫ్లూపై మాట్లాడినా, కొందరు మంత్రులు వెళ్లాక రాజకీయాంశలపైనా చర్చ జరిగినట్లు తెలిసింది.
రాజయ్య అంశంపైనా సీఎం వేడివేడిగానే మాట్లాడినట్టు, తలవంపులు తెస్తే ఎవరినైనా పక్కకు పెట్టుడేనంటూ ఆగ్రహించినట్టు సమాచారం. త్వరలో టీఆర్‌ఎస్ చేరనున్న టీడీపీ ఎమ్మెల్యేలు మాధవరపు కృష్ణారావు, ప్రకాశ్ గౌడ్ అంశంపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. కాగా, స్వైన్ ఫ్లూపై కేంద్రం నుంచి వచ్చిన వైద్యుల బృందంతో సీఎం భేటీ ఆయన అస్వస్థత కారణంగా శుక్రవారానికి వాయిదా పడింది. నిజామాబాద్‌కు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సీఎంను కలిసి వెంటనే జిల్లాకు వెళ్లారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఇప్పటికే కరీంనగర్ పర్యటనలో ఉండగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మహేందర్‌రెడ్డి తానిప్పటికే సమీక్ష జరిపినట్టు సీఎంకు వివరించారు.




