యాలాల : రంగారెడ్డి జిల్లాలో మూఢ నమ్మకాలకు ముక్కుపచ్చలారని పది నెలల పసిపాప బలైపోయింది. జిల్లాలోని యాలాల్ మండలం అక్కంపల్లి గ్రామంలో గుప్తనిధుల కోసం పూజ అనే చిన్నారిని కిరాతకంగా హత్య చేసిన ఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన మైలాల నర్సింహులు గురువారం రాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించి లక్ష్మి అనే మహిళను తాడుతో కట్టేసి… ఆమె పది నెలల వయసున్న కూతుర్ని ఇంటి బయటకు తీసుకెళ్లి పూజలు నిర్వహించడంతో పాటు ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.
ఇంటి ముందు పూజ మృతదేహంతో పాటు అక్కడ పూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. నర్సింహులే ఈ పనిచేసినట్లు పూజ తల్లి లక్ష్మి చెబుతుండగా… గ్రామస్తులు సైతం అతడిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నర్సింహులు గతంలోనూ క్షుద్ర పూజలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. గుప్త నిధుల కోసం పాపను బలి ఇచ్చినట్లు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి పూజ మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.




