Wednesday, 4 November 2026

తిగుల్ ను మండలంగా ప్రకటించేంత వరకు దీక్షలను కొనసాగిస్తాం

జగదేవ్ పూర్, ఆగస్టు 26 జనంసాక్షి :
జగదేవ్ పూర్ మండలంలోని తిగల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించేంతవరకు రిలే నిరాహారదీక్షలను కొనసాగిస్తామని తిగుల్ మండల సాధన సమితి సభ్యుడు, సర్పంచ్ భానుప్రకాష్ రావు, పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య  స్పష్టం చేశారు. తిగుల్ ను మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం  26 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా దీక్షలో వార్డు సభ్యులు ఎల్లారెడ్డి, రైతుబంధు గ్రామ కమిటీ అధ్యక్షుడు అశోక్, నాయకులు రాచమల్ల  సీతయ్య, అంజిరెడ్డిలు  కుర్చున్నారు. అనంతరం వారికి రైతుబంధు మండల కో ఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. మండల సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా పెద్ద గ్రామాలను ప్రభుత్వం మండలాలుగా ఏర్పాటు చేసిందని,  తిగుల్ గ్రామాన్ని కూడా మండలం ప్రకటించాలని కోరారు. రెవిన్యూ వ్వవస్థ ఏర్పడినప్పటి నుంచి తిగుల్ పెద్ద గ్రామమని, గతంలో మండలం కావాల్సి ఉండగా కాలేదన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ కు సైతం తిగుల్ చరిత్ర, ఉద్యమ చైతన్యం గురించి తెలుసు అని , సీఎం స్పందించి మండలంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. మండలంగా ప్రకటించే వరకు దీక్షలను కొనసాగించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపిటీసి మంజుల మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,  కరుణకర్ రెడ్డి, కనకయ్య, మహేందర్ రెడ్డి, రాజు, నర్సింహ్మరెడ్డి, ఈశ్వర్, ఆంజనేయులు, వెంకట్ రెడ్డి, కుమార్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.