– ఐజేయూ, టీయూడబ్ల్యూజే హెచ్చరిక
హైదరాబాద్,జూన్ 13(జనంసాక్షి): జర్నలిస్టులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం కాలయాపన చేయడం విచారకరమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ముఖ్య సలహాదారుడు కె. శ్రీనివాస్‌రెడ్డి, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ అన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో తమ సంఘం సాధించిన పథకాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు నోచుకోలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఇదే మౌనాన్ని ప్రదర్శిస్తే ఉద్యమ కార్యాచరణ రూపొందించక తప్పదని వారు హెచ్చరించారు. మంగళవారం బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో విూడియాతో మాట్లాడుతూ జర్నలిస్టులకు ముఖ్య సౌకర్యాలైన అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ పక్రియ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. గతేడాది రాష్ట్రంలో సుమారు 11 వేల అక్రెడిటేషన్ కార్డులు జారీకాగా, కేవలం 4,800 మంది జర్నలిస్టులకు మాత్రమే హెల్త్ కార్డులు మంజూరయ్యాయని వారు తెలిపారు. అయితే ఈ యేడాది సదరు హెల్త్ కార్డుల్లో కేవలం 60 శాతం మాత్రమే రెన్యువల్ అయ్యాయని, మిగతా 40 శాతం జర్నలిస్టులకు రెన్యువల్‌కు సంబంధించి సమాచారశాఖ నుంచి మెసేజ్‌లు అందలేదన్నారు. గత యేడాది హెల్త్ కార్డులు కలిగి యుండి ఈ యేడాది అవి రెన్యువల్ కాకపోవడంతో వివిధ ప్రమాదాల్లో, వ్యాధులకు గురై ఖరీదైన వైద్య సౌకర్యం పొందలేక 20మంది జర్నలిస్టులు మృతి చెందారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ యేడాది కొత్తగా అక్రెడిటేషన్ కార్డులు పొందిన జర్నలిస్టుల్లో 20 శాతం మాత్రమే హెల్త్ కార్డుకు సంబంధించి మెసేజ్ అందుకున్నట్లు వారు తెలిపారు. అక్రెడిటేషన్‌తో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని గతంలో పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ కనీసం అక్రెడిటేషన్ ఉన్న వాళ్లకి కూడా హెల్త్ కార్డు అందించలేని పరిస్థితి ఏర్పడిందని శ్రీనివాస్ రెడ్డి, అమర్‌లు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అక్రెడిటేషన్ల మంజూరీలో సైతం గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు. పలు జిల్లాల్లో అక్రెడిటేషన్ కమిటీల సమావేశాలు సక్రమంగా జరుగడంలేదని, సమాచార శాఖ అధికారులు లేని జిల్లాలు ఉన్నట్లు వారు గుర్తు చేశారు. మెదక్ జిల్లాలో సమాచారశాఖతో సంబంధం లేని మైనింగ్ శాఖకు చెందిన అధికారిని సమాచారశాఖలో బాధ్యతలు అప్పగించడంబట్టి చూస్తే జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాల తీరుతెన్నులు అర్థమౌతాయని వారు ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం నుండి మొదలుకొని రాష్ట్ర విభజన జరిగినంత వరకు రాష్ట్రంలో సుమారు 440మంది జర్నలిస్టులు, వివిధ వ్యాధులకు గురై ప్రమాదాల్లో మృతి చెందగా, ఎంతో అట్టహాసంగా నిర్వహించిన జనహిత కార్యక్రమంలో కేవలం 60 కుటుంబాలకే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మృతి చెందిన జర్నలిస్టులకు మాత్రమే
సహాయం అందిస్తామనడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడి, ప్రభుత్వం ఏర్పడకముందే మృతి చెందిన జర్నలిస్టులకు ఆంధ్ర ప్రభుత్వం సహాయం చేయాలా? అని వారు ధ్వజమెత్తారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో నమస్తే తెలంగాణ పాత్రికేయుడు లక్ష్మారెడ్డి తెలంగాణ కోసం ఎంతో పోరాడాడని, చివరికి ఢిల్లీలో సైతం తన గళాన్ని వినిపించి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నాడని, ఆ జర్నలిస్టు గుండెపోటుకు గురై ప్రాణం కోల్పోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సహించరానిదన్నారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల, చట్టాలపై అవగాహన లేనివాళ్లను ప్రభుత్వం వివిధ కమిటీల్లో నియమిస్తుండడం వల్లే రాష్ట్రంలో జర్నలిస్టులకు కష్టాలు తప్పడం లేదన్నారు. రేపు, మాపు అనుకుంటూ రెండేళ్లుగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం కాలయాపన చేయడం విచారకరమన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఐదుగురు జర్నలిస్టులపై ఆ జిల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, మునిసిపల్ వైస్ ఛైర్మన్ జాబేర్ అక్రమ కేసు బనాయించడమే కాకుండా సోషల్ విూడియాలో అసభ్యకర పదజాలంతో పోస్టింగ్‌లు చేస్తున్న వైనాన్ని తమ సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు.ఈ సంఘటనపై విచారణకు త్రీమెన్ కమిటీ నియమించినట్లు వారు తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా మునిసిపల్ సమావేశాల్లో జర్నలిస్టులను నిషేధిస్తూ ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సరైన చర్య కాదని శ్రీనివాస్‌రెడ్డి, అమర్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ, ఐజేయూ కార్యవర్గ సభ్యులు ఎం.ఏ. మాజిద్‌లు పాల్గొన్నారు.




