హైదరాబాద్,జనం సాక్షి): ప్రస్తుతం ఉన్న టీమ్‌తో తెలంగాణలో బలపడాలంటే లాభం లేదన్న విషయాన్ని బిజెపి గుర్తించడం లేదు. తాజాగా ఉప ఎన్నికల ఫలితాలతో బిజెపిపై ఉన్న భ్రమలు పూర్తిగా తొలగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేస్తామని జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చేసిన ప్రకటన ఇక మరోమారు చేయకపోవచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బిజెపిని నమ్మి ముందు నిలబడే నాయకులు లేరు. అలా వచ్చిన వారు మళ్లీ వెనక్కి పోయారు. ఇతర పార్టీల్లో ఉన్నవారిని, బలమైన నేతలుగా పేరున్న వారికి గాలం వేస్తున్నా ఫలించడం లేదు. ఆ పార్టీ ఎంత దైన్యంగా ఉందంటే.. పార్టీని వీడి వెల్లిపోతున్న కన్నా లక్ష్మీనారాయణను గట్టిగా పట్టుకుని పార్టీ అధ్యక్షపదవిని కట్టబెట్టారు. టీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న వారిని ఆకర్షించడం ద్వారా తెలంగాణలో బీజేపీ బలపడాలనుకుంటున్నది. అయితే అలాంటి ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించడం లేదు. ఎపిలో ఇలాగే బలపడాలనుకుని తొలినాళ్లలో ఆయాపార్టీల్లో ఉన్న నేతలను ఆకర్శించారు. వారంతా బిజెపిలో చేరినా ఆరోవేలులాగా గుర్తింపు లేకుండా ఉన్నారు. ఏపీలో బలపడాలనుకున్న బిజెపికి అడుగడునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. అక్కడ కుల రాజకీయాలు బాగా బలంగా ఉన్నాయి. గత ఎన్నికలతో పోల్చితే అక్కడ తెలుగుదేశం పార్టీ బలపడింది. నంద్యాల, కాకినాడ తర్వాత అది మరింతగా ఉందని రుజువయింది. ఈ పరిస్తితుల్లో బిజెపి ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందన్నది ముఖ్యం. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడమంటే అంత సులువు కాదు. ఇరు రాష్ట్రాల్లో బలవంతులైన నేతలు సిఎంలుగా ఉన్నారు. వారిని ఎదరించి నిలబడడం అన్నది అసాధ్యం కూడా. అందుకే ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని బిజెపి విమర్శిస్తూ వస్తోంది. ప్రజలు కూడా సందేహపడేలా ప్రచారం చేస్తోంది. అయితే ఈ ప్రచారాలతో పార్టీని బలోపతేం చేయాలనుకుంటే సాధ్యం కాదు. కేంద్రంలో మోడీ తీసుకుంటున్న నిర్ణయాలేవీ ప్రజలకు మేలు చేయడం లేదు. జిఎస్టీతో పాటు నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రజలు ఇంకా ఈ పరిణామాల నుంచి కోలుకోవడం లేదు. వీటిని తట్టుకుని ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఫలితం చూపంకుండా గెలుస్తామనో లేదా బలపడతామనో బిజెపి అనుకుంటే భ్రమే కాగలదు. అంతేనా అంటే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న సీట్లు రావడం కూడా కష్టమే. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలను ప్రభావితం చేయనంతకాలం ఎవరు వచ్చినా బిజెపికి కలసిరాదని గుర్తుంచుకుంటే మంచిది.




