Monday, 2 November 2026

దర్జాగా దోపిడీ

ఇసుక మాఫియా వైఖరి ‘చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్లు’ ఉంది. పట్టాభూముల పేరిట యంత్రాలు పెట్టి మరీ మంజీరను తోడేస్తున్నారు. ఇసుక మేటలు తొలగించుకుంటామని అనుమతులు తీసుకుని ఏకంగా నదినే కొల్లగొడుతున్నారు. రాయల్టీనీ ఎగవేస్తూ సర్కారు ఖజానాకు గండి కొడుతున్నారు. తాము మాత్రం కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ఇది అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

నిజామాబాద్: కోటగిరి మండలం కారేగాం శివారులో నిబంధనలకు విరుద్ధంగా పొక్లయిన్లను ఉపయోగిస్తూ, టన్నుల కొద్దీ ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తుండటం చర్చనీ యాంశంగా మారింది. పట్టాభూములలో ఇసుక మేటలు తొలగించేందుకు యంత్రాలను ఉపయోగించకూడదు. కానీ, ఇసుకాసురులు మాత్రం భూములను వదిలేసి మంజీర గర్భం నుంచి ఇసుకను యథేచ్ఛగా లాగేస్తున్నారు. భూగర్భ జలాలకు నష్టం కలుగకుండా ఇసుకమేటలు తొలగించుకోవాలని అనుమతులలో స్పష్టంగా పేర్కొన్నప్పటి కీ, సదరు వ్యక్తులు పట్టించుకోవడం లేదు. రో జుకు సుమారు 200 నుంచి 250 లారీలలో లోడింగ్ చేస్తున్నా రు. అక్రమ రవాణాను నిరోధించాల్సిన రెవెన్యూ, పోలీసు, గ నులు, రవాణా శాఖ అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో చూసీచూ డనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

నిబంధనలు బేఖాతరు
బిచ్కుంద, బీర్కూరు, కోటగిరి మండలాలలోని మంజీర పరీవాహక ప్రాంతాలలో కొందరు ఇసుక వ్యాపారులు పట్టాభూముల నుం చి ఇసుక మేటల తొలగిస్తామంటూ అనుమతులు తీసుకుంటున్నారు. నిబంధనల కు పాతరేసి మంజీరను తోడేయ డం పరిపాటిగా మార్చుకున్నారు. నదిని అనుకుని ఉన్న పట్టాభూముల సర్వే నంబర్ల మీద అనుమతులు పొంది, నదిలోనే యంత్రాలు పెట్టి, ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. ‘మాఫియా’కు ఇసుక రవాణా కాసులు కురిపిస్తోంది. తాజాగా కోటగిరి మండలంలోని కారేగాం ఇసుక తవ్వకాలకు అనుమతులు లభించాయి.

358, 359 సర్వే నంబర్‌లో నాలుగు ఎకరాల ఐదున్నర గుంటలు కె.బాబురెడ్డి, ప్రసాద్‌గౌడ్, ప్రభాకర్‌గౌడ్, శ్రీమతి జయమ్మ పేరుతో 45 రోజులలో 41,520 క్యూబిక్‌మీటర్ల ఇసుక తీసేందుకు అనుమతి లభించింది. 364, 365, 366 సర్వే నం.లో కె.బాబురెడ్డి పేరుతో 5.5 ఎకరాలలలో 33,427 క్యూబిక్ మీటర్లు 45 రోజులు, మూడవ బిట్ 364, 365, 366 సర్వే నం.లో 4.9 ఎకరాలలో, ప్రభాకర్‌రెడ్డి, జయమ్మ పేర్లపైన 34,155 క్యూబిక్ మీటర్లు 45 రోజులలో షరతులకు లోబడి ఇసుకను తీసేందుకు అనుమతించారు. ఇవే అనుమతులతో మంజీర తీరం నుంచి మొత్తంగా 135 రోజులు ఇసుక తరలించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ ఇసుక వ్యాపారి ఒప్పందం కుదుర్చుకోవడం విస్మయం కలిగిస్తోంది.

రాజధానిలో భలే డిమాండ్
మంజీర ఇసుకకు హైదరాబాద్‌లో భలే డిమాండ్ ఉండటంతో ఇసుక మాఫియా ఈ నదిపై కన్నేసింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాలకు చెం దిన పలువురు అధికార పార్టీ నేతల పేర్లు వాడుకుంటూ యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. ప్రధానంగా బీర్కూరు, బిచ్కుంద, కోటగిరి మండలాలలో ఈ దందా సాగుతోంది. నదీ పరీవాహక ప్రాంతాలకు చెందిన రైతులను మభ్యపెడుతూ, గ్రామ కమిటీలను కట్టడి చేస్తూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు.

కోటగిరి మండలం కారేగాం శివా రులో అనుమతులు పొందిన ‘మాఫియా’ ఏకంగా మంజీరలోనే పొక్లయినర్లను పెట్టి హైదరాబాద్‌కు ఇసుక తరలిస్తుందంటే పరిస్థితిని అర్దం చేసుకోవచ్చు. లారీ ఇసుకకుఇక్కడ రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు ధర పలుకుతుండగా, హైదరాబాద్‌లో రూ. 25 వేల నుంచి రూ.35 వేల వరకు ఉంది. రోజుకు 200 నుంచి 250 వర కు లారీలు హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. ఈ లెక్కన రోజూ రెండున్నర కోట్లరూపాయల విలువ చేసే ఇసుక తరలిపోతోంది. ఇదే విధంగా మరో ఏడాదిపాటు ఇసుక రవాణాసాగితే మంజీరా పరీవాహక ప్రాంతం ఎడారిగా మారిపోయే ప్ర మా దం ఉంది. లారీలకు లోడింగ్ చేసిన ప్రతి క్యూబిక్ మీటరుకు ప్రభుత్వానికి రూ.40 రాయల్టీ కింద చెల్లించాలి.

నిబంధనల ప్రకారం 10 టన్నుల కెపాసిటీ గల లారీలో 6 క్యూబిక్ మీటర్లు,17టన్నుల లారీలో పది క్యూబిక్ మీటర్ల ఇసుకను మాత్రమే లోడింగ్ చేయాల్సి ఉంటుంది. పది టైర్ల లారీలలో 20 టన్నులు (10.5 క్యూబిక్ మీటర్లు), 12 టైర్ల లారీలలో 22.5 టన్నులు (13 క్యూబిక్ మీటర్లు) ఇందుకు రాయల్టీ కింద ప్రభుత్వానికి ఒక్కో లారీకి సామర్థ్యాన్ని బట్టి రూ.240 నుంచి రూ.920 వరకు  చెల్లించాలి. ఓవర్‌లోడ్‌తో లారీలు నింపుతున్న వ్యాపారులు రాయల్టీనీ ఎగవేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *