ఒకటి రెండురోజుల్లో సిఎం కెసిఆర్ నిర్ణయం?
హైదరాబాద్,మే21(జనం సాక్షి): రైతుబంధు చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ ఎలా జరిగిందనే దానిపై ఒకటి రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ సవిూక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే వివిధ సంస్థలకు ఉన్న భూములకు , దేవాదాయశాఖ భూములకు పాస్‌పస్తకాలు ఇచ్చే అంశంపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. దేవాదాయ భూములకు పాస్ పుస్తకాలు అందించి వాటికి కూడా రైతుబందు చెక్కులను దేవాలయాలకు అందించి వాటిని పరిపుష్టం చేయాలన్న విజ్ఞప్తులు వచ్చాయి. వీటిని సిఎం కెసిఆర్ పరిశీలిస్తున్నారని సమాచారం. అదే జరిగితే వేలాది దేవాలయాలకు ప్రాణప్రతిష్ట జరగగలదని అంచనా. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం విజయవంతంగా సాగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని ప్రారంభించిన తరవాత రాష్ట్రవ్యాప్తంగా చెక్కుల పంపిణీ విజయవంగంగా సాగింది. అన్నదాతలకు కేసీఆర్.. పంట పెట్టుబడి అందించడంపై కర్షకలోకమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు అన్నదాతలు 4వేల 700 కోట్ల రూపాయలను డ్రా చేసుకున్నారు. 37 లక్షల పట్టాదార్ పుస్తకాలను అందుకున్నారు. ఇక మిగిలిన చెక్కులు, పట్టదార్ పుస్తకాలను ఇవాళ్టి నుంచి తహశీల్దార్ కార్యాలయాల్లో లబ్దిదారులకు అందజేయ నున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించిన రైతుబంధు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ,రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు. గ్రామాల్లో పట్టాదార్ పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు పంపిణీ చేశారు. వీటిని అందుకున్న రైతులు ఆనందంగా ఉన్నారు. సాగుకు ఇంత పెద్ద సహాయం చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. కొంత మంది రైతుల ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోవడంతో ఆయా రైతుల పాస్ పుస్తకాల ముద్రణ జరగలేదు. రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ సందర్భంగా లక్ష మంది రైతులు ఆధార్ లింక్ చేసుకున్నారు. ఇప్పుడు వారి పాస్‌పుపస్తకాలను ప్రభుత్వం ముద్రిస్తోంది. ఇక ఇప్పటికే ప్రింట్ అయి చిన్నచిన్న తప్పులు దొర్లిన పుస్తకాలను రీ ప్రింటింగ్ చేస్తున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు 50 లక్షల పాస్ పుస్తకాలను ముద్రించారు. ఇందులో 37 లక్షల పాస్‌పుస్తకాలు రైతులకు అందజేశారు. ఇంకా పంపిణీ చేయాల్సిన 13 లక్షల పాస్‌పుస్తకాలతో పాటు రైతుబంధు చెక్కులను ఇవాళ్టి నుంచి తహశీల్దార్ కార్యాలయాల్లో రైతులుకు అందజేస్తున్నారు. ఈ మేరకు అన్ని మండల కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.




