నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై పిడి చట్టాన్ని నమోదు చేసి దుకాణాల లైసెన్స్ రద్దు చేయాలి .. మంత్రి సబితా ఇంద్రారెడ్డి


వికారాబాద్ రూరల్, జూలై 19: (జనం సాక్షి)
నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై పిడి చట్టాన్ని నమోదు చేసి దుకాణాల లైసెన్సును రద్దు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.బుధవారం మాడ్గుల్ చిట్టెంపల్లి డిపిఆర్ సి భవన్ లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పి.సునీత మహేందర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, పరిగి శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి , జెడ్పి డిప్యూటీ సీఈవో సుభాషిని, జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయానికి పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. ఫర్టిలైజర్ దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో సోయాబీన్ పంటలకు అనుకూలమైన వాతావరణం ఉందని, పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. రైతు వేదికల్లో సమావేశాలు ఏర్పాటు చేసి పంటల సాగుపై సలహాలు సూచనలు అందించాలని ఆమె అధికారులకు తెలిపారు. రెండవ విడత లో భాగంగా దళిత బంధు పథకం కింద నియోజకవర్గానికి 1100 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనట్లు, ప్రభుత్వ ఆదేశాల అందిన పిదప ఎంపిక ప్రక్రియను నిర్వహించినున్నట్లు మంత్రి తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకొని సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పారిశుధ్య పనులు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. త్రాగునీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు పైపు లీకేజీ పనులను సరిచేయాలని మంత్రి తెలిపారు. భోజన పథకంలో భాగంగా పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించని పక్షంలో ఏజెన్సీలను తొలగించాలని మంత్రి డిఇఓ ను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిన తరుణంలో ప్రజా ప్రతినిధుల, స్థానిక నాయకుల సహకారంతో ఎక్కువ సంఖ్యలో పాఠశాలలో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు. ఆర్వో నీటి కంటే మిషన్ భగీరథ నీరు స్వచ్ఛమైనదనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ మిషన్ భగీరథ త్రాగునీరుపై అవగాహన కల్పించాలని మంత్రి తెలిపారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పి. సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ ఖరీఫ్ లో లోటు వర్షపాతం నమోదు ఆందోళన కలిగిస్తుందని, రైతులు ఆలస్యంగా పంటలు సాగు చేయడం జరుగుతుంది, ఎలాంటి పంటలు సాగు చేయాలో రైతులకు తెలియజేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు జెడ్పీ చైర్పర్సన్ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు పంటలు సాగు చేసే దిశగా సూచనలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న రైతుబంధును సద్వినియోగం చేసుకునేలా సూచనలు సలహాలు ఇవ్వాలని ఆమె తెలిపారు. జిల్లాలో జొన్న నూనె గింజల సాగు రానురాను తగ్గిపోతుంది వాటి సాగును పెంచేలా అధికారులు చలో చూపాలని ఆమె అధికారులకు సూచించారు. తేనెటీగల పెంపకం కూడా లాభదాయకంగా ఉంటుందని వాటిపై రైతులు దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలన్నారు. పట్టణాల్లో ఆర్గానిక్ కూరగాయలకు అధికంగా ఉన్నందున రైతులు ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయల పండించేలా అవగాహన కల్పించాలన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ధరణి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్ కు సూచించారు. జిల్లాకు మెడికల్ కాలేజ్ మంజూరు అయినందున వైద్యం , వైద్య విద్య మెరుగుపడేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె తెలిపారు. బస్తీ దావఖానాల్లో మెరుగైన వైద్యం అందేలా తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే విధంగా ప్రత్యేక కార్యచరణ రూపొందించి పిల్లలను సిద్ధం చేయాలని అదేవిధంగా పేరెంట్స్ సమావేశాలు కూడా నిర్వహించి కౌన్సిలింగ్ ఇవ్వాలని జడ్పీ చైర్పర్సన్ విద్యా శాఖ శాఖ అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ ద్వారా అందించే నీటిని వృధా కాకుండా అన్ని గ్రామాలకు అందజేయాలని తెలిపారు. గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులను పూర్తిచేసిన చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లో విద్యుత్తు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చందే విధంగా ప్రతి ఒక్కరం కృషి చేయాలని జడ్పీ చైర్పర్సన్ పిలుపునిచ్చారు.
సర్వసభ్య సమావేశంలో ఎంపీపీలు, జడ్పిటిసిలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

తాజావార్తలు