Thursday, 5 November 2026

నగదుగా మారిన 41 లక్షల చెక్కులు

రైతుబంధుపై ప్రభుత్వం వివరణ

హైదరాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): రైతుబంధు పథకం కింద రూ.4,738కోట్ల విలువైన 46లక్షలకు పైగా చెక్కులను పంపిణీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. అందులో 41లక్షలకు పైగా చెక్కులను రైతులు బ్యాంకుల ద్వారా నగదుగా మార్చుకున్నారని అధికారులు వెల్లడించారు. బ్యాంకుల నుంచి రైతులు రూ.4,399.24 కోట్ల నగదు తీసుకున్నట్లు తెలిపారు. చాలామంది కర్షకులు బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండానే చెక్కులు మార్చుకున్నారని పేర్కొంది. 2లక్షలకు పైగా రైతులు బ్యాంకు ఖాతాల ద్వారా చెక్కులను నగదుగా మార్చుకున్నారు. పాసు పుస్తకాల్లో పొరపాట్ల వల్ల, విదేశాల్లో ఉన్నందున కొందరు రైతులకు చెక్కుల పంపిణీ చేయలేదని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు వెయ్యి మంది రైతులు పంట పెట్టుబడి సాయాన్ని స్వచ్ఛంధంగా వదులుకున్నట్లు సమాచారం. ఈ మొత్తం మొత్తం విలువ రూ.2 కోట్ల వరకు ఉందని.. దాన్ని రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఖాతాకు జమ చేస్తామని చెప్పారు.