– నగర మేయర్ బొంతు రామ్మోహన్
– అర్థరాత్రి రోడ్ల మరమ్మతు పనులను పరిశీలించిన మేయర్
హైదరాబాద్, మే21(జనం సాక్షి) : హైదరాబాద్ నగరంలో రూ. 11వందల కోట్ల వ్యయంతో రహదారుల మరమ్మతులు చేపడుతున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. నగరంలో కొనసాగుతున్న రోడ్ల మరమ్మత్తు పనులను గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. ఆదివారం అర్థరాత్రి పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన… పనులు కొనసాగుతున్న తీరు, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. ఆరు వేల కోట్ల వ్యయంతో అబిడ్స్, రాంకోఠి, గన్‌ఫౌండరీ తదితర ప్రాంతాల్లో చేపట్టిన హెచ్‌ఆర్‌డీసీ రహదారి పనులను ఆకస్మిత తనిఖీలో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్లను అభివృద్ధి చేస్తునట్లు మేయర్ తెలిపారు. వర్షాకాలం వస్తే రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. నగరంలో దాదాపు 11 వందల కోట్ల రూపాయల నిధులతో రహదారుల మరమ్మత్తులు చేస్తున్నట్లు వివరించారు. వాటిని నాణ్యతతో నిర్మాణంచేపడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా నగరంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ముఖ్య కూడళ్లను గుర్తించి అక్కడ ట్రాఫిక్ రద్దీ లేకుండా చర్యలు చేపడుతున్నట్లు మేయర్ తెలిపారు. నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు ప్రభుత్వం పట్టుదలతో ఉందని, ఆ మేరకు పనులు జరుగుతున్నాయని అన్నారు.




