– కేరళలో ఇప్పటివరకు 10 మంది మృతి
– మరో 20 మందికి లక్షణాలు గుర్తింపు
– అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
హైదరాబాద్, మే21(ఆర్‌ఎన్‌ఎ) : నిపా వైరస్ ప్రజలను వణికిస్తోంది. దీని బారిన పడి కేరళలో 10 మంది మరణించారు. వీరిలో ఓ నర్సు (31 ఏళ్లు) కూడా ఉన్నారు. మరో 20 మందిలో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించారు. వీరిని అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందించారు. కోజికోడ్, మలప్పురం జిల్లాలో ఇటీవల పలువురు విష జ్వరాల బారిన పడ్డారు. వీరి రక్త నమూనాలను పుణెళిలోని నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్కు పంపించగా.. వీరంతా ప్రమాదకర నిపా వైరస్ బారిన పడినట్లు తేలింది. సోమవారం (మే 21) ఉదయం వరకు వీరిలో 10మంది మరణించగా, మరికొత మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గబ్బిలాలు, పందులు తదితర జంతువుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. నిపా వైరస్ వ్యాప్తి చెందడంతో కేరళ ప్రజలను వైద్యశాఖ అప్రమత్తం చేసింది. దీనిపై కేంద్రం కూడా అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశాల మేరకు కేరళ చేరుకున్న జాతీయ వ్యాధి నియంత్రణకు చెందిన ఉన్నత స్థాయి వైద్య బృందం సోమవారం వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తోంది. అరుదైన వైరస్. గబ్బిలాలు, పందులు, ఇతర జంతువులతో ఈ వైరస్ వ్యాపిస్తుంది. దీనికి ఇంతవరకు వ్యాక్సిన్ కూడా లేనట్లు తెలుస్తోంది. తీవ్రమైన జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, రక్తపోటు పడిపోవడం, బలహీనత ఈ వ్యాధి లక్షణాలు. ఇప్పటివరకు ఈ వ్యాధి కారణంగా కేరళలో 10 మంది మృతిచెందగా.. మరో 20 మంది ఇదే లక్షణాలతో వేర్వేరు ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా కేరళ ఆరోగ్యశాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. నిఫా వైరస్ బాధితులకు ఆసుపత్రుల్లో ప్రత్యేక అబ్జర్వేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారి బంధువులను కూడా దూరంగా ఉంచారు. అటు కేంద్ర ఆరోగ్యశాఖ కూడా అప్రమత్తమైంది. వెంటనే కేరళ వెళ్లి పరిస్థితిని సవిూక్షించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా.. ఎసీడీసీ డైరెక్టర్‌ను ఆదేశించారు.
వ్యాధి లక్షణాలు..
నిపా వైరస్ సోకిన వారికి తీవ్రమైన జ్వరం వస్తుంది. వాంతులు, తలనొప్పితో పాటు శ్వాస
తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ డెడ్లీ వైరస్‌ను అరికట్టడానికి ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్లు, ఔషధాలు అందుబాటులో లేవు. దీంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.
వణికిస్తున్న నిపా వైరస్




