Monday, 2 November 2026

నియోకవర్గ పరిధిలోనే ఎన్నికల కోడ్‌

బతుకమ్మ చీరల పంపిణీకి కూడా ఆంక్షలు
నిఘా బృందాలతో తనిఖీలు చేపట్టనున్న అధికారులు
కరీంనగర్‌,అక్టోబర్‌2 జనం సాక్షి :  హుజురాబాద్‌ నియోజకవర్గంలో మాత్రమే ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కర్ణన్‌ ప్రకటించారు. ఎన్నికల ప్రవర్తన నియామవళి మొత్తం ఈ శాసనసభ నియోజకవర్గ పరిధిలో మాత్రమే ఉంటుందని, కరీంనగర్‌ నగరపాలక సంస్థకు, వరంగల్‌ నగరపాలక సంస్థకు ఇది వర్తించదని ఆయన వివరించారు. దీంతో ఇక్కడ బతుకమ్మచీరల పంపిణీకి అడ్డంకి ఏర్పడిరది. అయితే పండగ తరవాత పంచే అవకావం ఉందని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే ఆలోచన చేస్తోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా వరంగల్‌, హుజూరాబాద్‌ మధ్యలో నిఘాబృందాల పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తనిఖీ చేశారు. వరంగల్‌ నుండి హుజురాబాద్‌కు వచ్చే ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును అబ్జర్వర్‌ జీ.ఎలమురుగుతో కలిసి కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ రహదారిపై వచ్చే ప్రతి వాహనాన్ని నిశితంగాతనిఖీ చేయాలని కలెక్టర్‌ నిఘా బృందాలను ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా అక్రమంగా డబ్బులు, మద్యం రవాణా చేసే అవకాశముందని నిఘాబృందాలు 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ వాహనాలను తనిఖీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే తొలిరోజు నామినేషన్ల స్వీకరణ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కర్ణన్‌ పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన రిటర్నింగ్‌ అధికారి రవీందర్‌రెడ్డిని, సహాయ రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో భారీగా పోలీస్‌ బలగాలను మొహరించి బందోబస్తు చేపట్టనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే అందిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో భారీ ఎత్తున కేంద్ర బలగాలను మోహరించే అవకాశం ఉన్నది. ఎన్నికల పరిశీలన కోసం వివిధ రాష్టాల్రకు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను కూడా సీఈసీ ఒకటిరెండు రోజుల్లో పంపించే అవకాశముందని సమాచారం. స్థానికంగా ఇప్పటికే 13 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిఘాబృందాలను నిత్యం తనిఖీకి సిద్ధంగా ఉంచారు. రెండు టాస్క్‌ఫోర్సు టీంలు, ఐదు ఫ్లైయింగ్‌ స్వ్కాడ్స్‌ కూడా ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఎన్నికల సందర్భంగా ధన, మద్యం పంపిణీ, ఇతర ప్రలోభాలు పెట్టే అవకాశాలు లేకుండా డేగకళ్లతో పరిశీలిస్తాయి. ఫిర్యాదులు అందిన వెంటనే అక్కడికి వెళ్లేందుకు వీలుగా ఈ బృందాలను అప్రమత్తంగా ఉంచారు. జిల్లా వ్యాప్తంగా 73 మంది వ్యక్తిగత ఆయుధాలు కలిగి ఉండగా ఇప్పటికే 39 మంది నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా వారి నుంచి త్వరలోనే ఆయుధాలను డిపాజిట్‌ చేసుకోనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి గొడవలు జరుగకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. గొడవలకు పాల్పడే అవకాశాలున్న వారి జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ కేసుల్లో బైండోవర్‌ అయినవారిపై దృష్టిసారించి వారిపై నిఘా పెట్టారు. నియోజకవర్గంలో 309 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా వాటిలో సెన్సిటివ్‌, హైపర్‌ సెన్సిటివ్‌ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపనున్నారు. ఇప్పటికే 3వేల మంది పోలీసు బలగాలు నియోజవకర్గపరిధిలో విధులు నిర్వహిస్తున్నారని, కేంద్రం కూడా త్వరలోనే భారీ ఎత్తున బలగాలను పంపించేందుకు నిర్ణయం తీసుకున్నదని సమాచారం. ఒకటిరెండు రోజుల్లో కేంద్రబలగాలు హుజూరాబాద్‌కు చేరుకోనున్నాయని అధికారవర్గాలు అంటున్నాయి.