హైదరాబాద్,మే17(జనం సాక్షి ): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా మరో ప్రతిష్ఠాత్మక జాతీయ సదస్సు జరుగనున్నది. రెండురోజులపాటు జరిగే సదస్‌ఉకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదిక కానుంది. స్టార్టప్ సమ్మిట్ ఎక్స్‌పో 2018ను శుక్ర, శనివారాల్లో నిర్వహించనున్నారు. ఈ ఎక్స్‌పోకు దేశవ్యాప్తంగా ఉన్నవే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల స్టార్టప్‌ల ప్రతినిధులు హాజరు కానున్నారు. దేశంలో స్టార్టప్ సంస్కృతిని పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆవిష్కరణలను వ్యాపారబాట పట్టించడం, మహిళా ఆవిష్కర్తలు ఎదిగేందుకు గల అవకాశాలు అన్వేషించడంతోపాటుగా మరెన్నో అంశాలు విపులంగా చర్చించనున్నారు. ఫ్రాంచైజీ ఇండియా సంస్థ నిర్వహిస్తున్న ఈ సదస్సుకు టై హైదరాబాద్, ఓయో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆవిష్కరణల కేంద్రమైన రీచ్ (రీసెర్స్ ఆండ్ ఇన్నోవేషన్ సర్కిల్) సపోర్టింగ్ పార్ట్‌నర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ సమ్మిట్‌కు దేశవిదేశాల స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో పాటుగా, విధానకర్తలు, ఇతర రంగాల నిపుణులు హాజరుకానున్నారు. మంత్రికెటిఆర్ ఇందులో పాల్గొంటారు.




