పలు అంశాలపై చర్చించే అవకాశం
హైదరాబాద్,మే3(జనం సాక్షి): ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం సమావేశం జరుగనుంది. పీఆర్సీ, పెన్షన్, బదిలీలు తదితర అంశాలు భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. దీనిపై ఇప్పటికే ఉద్యోగ సంఘాలు చర్చించి సిఎంను కలవాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతో సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ లో భేటీ జరుగనుంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నాయకులకు ఆహ్వానాలు పంపించారు. జూలై -2018 నుంచి అమలులోకి వచ్చే విధంగా పీఆర్సీ.. లేని పక్షంలో మధ్యంతర భృతి, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేయడం, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయడం వంటి అంశాలు భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. అలాగే అంతర్ జిల్లా బదిలీలు, అంతర్రాష్ట్ర బదిలీలు, అన్ని జిల్లాలకు వెల్ నెస్ సెంటర్లు, తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారని సమాచారం. ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు గతంలో సీఎస్ ఎస్కే జోషీతో పాటు వివిధ శాఖల కార్యదర్శులతో చర్చలు జరిపారు. పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆర్థిక , జీఏడీ తదితర శాఖలు నివేదికలను సిద్ధం చేసినట్టు సమాచారం. 2015లో జరిగిన చర్చల సందర్భంగా సీఎం కేసీఆర్? ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించారు. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఊహించని విధంగా 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించి జీతభత్యాలను పెంచారు. తెలంగాణ సర్కారు ఎంఎ/-లాయిస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని చాటి చెప్పారు. అదే విధంగా ఈ సారి కూడా తీపి కబురు అందుతుందని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.
—————–




