Wednesday, 4 November 2026

నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు

ఆరు నియోజకవర్గాలు.. 83 మంది అభ్యర్థులు
హైదరాబాద్‌: పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నికలకు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. మూడు ఉపాధ్యాయ (శ్రీకాకుళం- విజయనగరం – విశాఖపట్నం, వరంగల్‌ – ఖమ్మం- నల్గొండ, మెదక్‌ – నిజామాబాద్‌ – ఆదిలాబాద్‌ – కరీరనగర్‌), మూడు పట్టభద్రుల (తూర్పు- పశ్చిమ గోదావరి, కృష్ణా – గుంటూరు, మెదక్‌ – నిజామాబాద్‌ – ఆదిలాబాద్‌ – కరీంనగర్‌ ) శాసనమండలి నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. ఆరు ఎమ్మెల్సీ నియోజకవర్గలకు మొత్తం 1437 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. మొత్తం 84 మంది అభ్యర్థులు నామినేషన్లు  దాఖలు చేశారన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి దుర్గాప్రసాద్‌ మరణించడంతో 83 మంది బరిలో ఉన్నారని చెప్పారు. పట్టభద్రుల స్థానాలకు 64 మంది, ఉపాధ్యాయ స్థానాలకు 19 మంది పోటీ చేస్తున్నారని వివరించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో లైవ్‌ వెబ్‌కాస్ట్‌తో పాటు సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆరుగురు సీనియర్‌ ఐఏఎన్‌ అధికారులను పరిశీలకులుగా నియమించిందన్నారు. మొత్తం ఆరు నియోజకవర్గాల్లో 6,32,000 మంది ఓటర్లు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. 25వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తామని చెప్పారు. ఆరు కేంద్రాల్లో లెక్కింపు ఉంటుందన్నారు. మార్చి 29 నాటికి ఖాళీ అయ్యే  ఎమ్మెల్సీ స్థానాల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామని, వాటికి త్వరలోనే నోటిఫికేషన్‌ రావచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *