Tuesday, 3 November 2026

న్యూ ఇయర్‌ వేడుకల్లో జీరో యాక్సిడెంట్‌ కోసం కసరత్తు

నిబంధనల మేరకు నడచుకోవాలని సూచన
కఠినంగా నిబంధనల అమలుకు అధికారుల ఆదేశాలు
హైదరాబాద్‌,డిసెంబర్‌25(జ‌నంసాక్షి):  న్యూ ఇయర్‌ వేడుకల్లో ఎలాంటి అపశృతికి తావులేకుండా, జీరో యాక్సిడెంట్‌ డే కోసం పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అనేక విధాలుగా ప్రచారం చేపట్టారు.
నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. డిసెంబర్‌ 31న రాత్రికి నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు వెలువరించారు. నూతన సంవత్సర వేడుకలను పకడ్బందీగా నిర్వహించేందుకు మూడు కమిషనరేట్ల పోలీస్‌ ఉన్నతాధికారులు పలు నిబంధనలను రూపొందించారు. న్యూ ఇయర్‌ ఈవెంట్‌ పర్మిషన్లకు సంబంధించి ముందస్తుగా కనీసం ఏడు రోజుల ముందు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. డిసెంబర్‌ 31న రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే న్యూ ఇయర్‌ వేడుకలకు అనుమతి ఉంటుందన్నారు. ఈవెంట్లకు నిర్వాహకులు అనుమతులు ఉన్నవారినే అనుమతించాలన్నారు. డీజేలకు అనుమతి లేదన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఆంక్షలు ఉంటాయని, డ్రంకెన్‌ డ్రైవ్‌ చేయొద్దని కూడా హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలు సజావుగా, శాంతియుతంగా సాగడానికి హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో  కట్టుదిట్టమైన చర్యలకు పూనుకున్నారు.  సైబరాబాద్‌ పరిధిలోని స్టార్‌ ¬టళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, ఫార్మ్‌ హౌస్‌లు, రిసార్టుల యాజమాన్యలతో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ సమావేశం అయ్యారు. న్యూ ఇయర్‌ వేడుకలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఏటా మద్యం మత్తులో ఎంతో మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోవడమేకాక ఇతరుల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారని సైబరాబాద్‌
పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సైబరాబాద్‌ పరిధిలో గతేడాది పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగలేదన్నారు. ఈసారి నూతన సంవత్సర స్వాగత వేడుకల్లో కూడా గతేడాదిలాగానే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. వేడుకలను ‘జీరో యాక్సిడెంట్‌ డే’ అండ్‌ ‘ఇన్సిడెంట్‌ ఫ్రీ డే’గా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో న్యూఇయర్‌ వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎక్కువగా స్టార్‌ ¬టళ్లు, క్లబ్‌లు, పబ్‌లలో ప్రత్యేక ఈవెంట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈవెంట్లు జరిగే ప్రాంతంలో ప్రతిచోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో… అక్కడ నిర్వహణ బాధ్యతల కోసం ప్రైవేట్‌ సెక్యూరిటీలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. నిబంధనలు అతిక్రమించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 31న రాత్రి మహిళల భద్రత కోసం షీటీమ్స్‌ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే వారిని అరెస్ట్‌ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అలాగే ఆ రోజు రాత్రి ఒంటి గంట తర్వాత స్పెషల్‌ డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు సన్నద్ధమయ్యారు. పేకాటరాయుళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. రేవ్‌ పార్టీలకు అనుమతి లేదన్నారు. అగ్నిప్రమాదాలకు నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, అవి జరుగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పోలీసులు సూచించారు.