Monday, 2 November 2026

పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభం: మంత్రి హరీష్ రావు

జ‌నంసాక్షి: దళారుల చేతిలో అన్నదాతలు మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. సర్కారు చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు కాటన్ కార్పోరేషన్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేక దృష్టిసారించడంతో కాటన్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌ చొక్కలింగం సీసీఐ కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.

వివిధ జిల్లాల్లో రైతులు వారం రోజుల నుంచి పత్తి పంటను తీస్తున్నారు. దీంతో మార్కెట్‌కు భారీగా పత్తి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 143 పత్తి కొనుగోలు కేంద్రాలను దశలవారీగా ప్రారంభించనున్నారు. వీటి ఫలితంగా పత్తి కొనుగోళ్లలో.. దళారుల బెడద తగ్గే అవకాశముంది. తేమశాతం 8 కంటే తక్కువగా ఉండేలా పత్తిరైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది. 4 వేల 320 రూపాయల మద్దతు ధరకే పత్తిని విక్రయించాలని మంత్రి హరీష్ రావు రైతులకు సూచించారు. పత్తితోపాటు మొక్కజొన్న, పెసర్లు, సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను కూడా వ్యవసాయ ,మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసింది. మొక్కజొన్న కొనుగోలుకు 231 కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటికే 88 వేల క్వింటాళ్లను మార్క్ ఫెడ్‌ కొనుగోలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 20 కొనుగోలు కేంద్రాల్లో సోయాబీన్‌ను కొనుగోలు చేయనున్నారు.  దళారుల చేతిలో అన్నదాతలు మోసపోకుండా మార్క్ ఫెడ్‌, హాకా, అయిల్‌ఫెడ్‌ సంస్థలు పంటలను కొనుగోలు చేస్తున్నాయి. తమకు మద్దతు ధర ఇప్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.