బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు
హైదరాబాద్,జూన్12(జనం సాక్షి ): ఇటీవలే ప్రకటించిన పోలీస్ ఉద్యోగాలను పూర్తి పారదర్శకంగా భర్తీ చేసేందుకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సర్వం సిద్ధం చేసింది. ఎనిమిది నెలల్లో నియామకాల భర్తీ పక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. రాత పరీక్షను ఆగస్టులో నిర్వహించనున్నట్లు బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. నోటిఫికేషన్‌లో వెలువరించిన మొత్తం 18,428 ఉద్యోగాల భర్తీ పక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ చానెల్ టీ-సాట్ నిర్వహించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సుమారు గంటన్నర పాటు పలువురు నెటిజన్లు, వీక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ పక్రియను పారదర్శకంగా, పక్కాగా నిర్వహించేందుకు బోర్డు సిద్ధంగా ఉందన్నారు. దేహదారుడ్య, రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అభ్యర్థులు దళారులను నమ్మొద్దని, ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి అనుమానాలు ఉన్నా బోర్డు హెల్ప్ లైన్, లేదా వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని సూచించారు.




