Wednesday, 4 November 2026

పార్కింగ్‌ దందాలపై ఫిర్యాదు 

నిబంధనలు ఖచ్చింతంగా అమలు చేసేందుకు కొరడా
హైదరాబాద్‌,మే5(జ‌నం సాక్షి): హైదరాబాద్‌ విశ్వనగర స్థాయి హంగులను సమకూర్చుకొంటోంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో షాపింగ్‌మాల్స్‌, మల్టీప్లెక్స్‌లను నిర్మిస్తున్నారు. చాలాకాలం క్రితమే మొదలైన ఈ ఒరవడి ఇప్పుడు మరింత విస్తృతమవుతోంది. ఇదే సమయంలో ఆయా వాణిజ్య సముదాయాలు, మల్టీప్లెక్స్‌లు వినియోగదారుల హక్కుల్ని కాలరాస్తున్నాయి. అధిక శాతం షాపింగ్‌మాళ్లు, మల్టీప్లెక్స్‌లు నిబంధనలను తుంగలో తొక్కి వినియోగదారులను దోచుకొంటున్నాయి. ఇటీవల కొందరు ఈ
విషయంలో నేరుగా మంత్రి కెటిఆర్‌కు ఫిర్యాదు చేశారు. అనేకులు జిహెచ్‌ఎంసికి ఫిర్యాదు చేశారు. ఇక సినిమాహాళ్లు, మల్టీపెక్స్‌లో తినుబండారాలు, డ్రింక్‌లపపైనా ఫిర్యాదు చేశారు. వీటిపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఇకపోతే వాహనాలకు పార్కింగ్‌ వసతిని ఉచితంగా కల్పించాలనే జీహెచ్‌ఎంసీ చట్టాన్ని ఎవరూ ఖాతరు చేయడం లేదు. అమలయ్యేలా చూడాల్సిన యంత్రాంగం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాణిజ్య సముదాయాల్లో ఉచిత పార్కింగ్‌ అంశంపై చర్చ జరగాల్సి ఉందని, చట్ట ప్రకారం ఉచిత పార్కింగ్‌ సౌకర్యం కల్పించాల్సి ఉన్నా, యాజమాన్యాల వాదన మరోలా ఉందని  జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డాక్టర్‌.బి.జనార్దన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దాంతో నిబంధనల్ని అమలు చేయడం కుదరట్లేదు. ఈ నేపథ్యంలో ఇతర మెట్రో నగరాల మాదిరి కొత్త పార్కింగ్‌ విధానాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. పెద్దపెద్ద షాపింగ్‌మాళ్లకు కారులో వెళ్లి  షాపింగ్‌ చేస్తే  మొదటి రెండు గంటలకు రూ.50.. తర్వాత మూడు గంటలకు గంటకు రూ.30 చొప్పున తీసుకొంటున్నారు. షాపింగ్‌మాల్‌ మేనేజర్‌ని పార్కింగ్‌ రుసుం వసూలుపై ప్రశ్నించగా.. ఉచిత సౌకర్యం కల్పిస్తే షాపింగ్‌ చేయని వాళ్లూ వరుస కడతారని చెప్పారు. వినియోగదారులు మాత్రం ఉచిత పార్కింగ్‌ తమ హక్కు అని, సక్రమంగా అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు. కుటుంబంతో వెళ్లి సినిమా చూసినా అదే పరిస్థితి. ఇందువల్లనే చాలా మంది మాల్స్‌ ముందు రోడ్డుపై వాహనాలను నిలిపేస్తున్నారు.