Wednesday, 4 November 2026

సత్ఫలితాలు ఇస్తున్న ట్రాఫిక్‌ రూల్స్‌

 హైదరాబాద్‌,మే5(జ‌నం సాక్షి):  ట్రాఫిక్‌ ఉల్లంఘనుల నడ్డి విరిచేందుకు రంగం సిద్ధమవుతోంది. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం సుప్రీకోర్టు మార్గదర్శకాలను అనుసరించి సవరించిన మోటారు వాహనాల చట్టం నిబంధనల అమలుకు నగర పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. రవాణా శాఖ జీవో జారీ చేయడంతో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిబంధనల్లోని పాయింట్ల విధానంపై ముందుగా వాహనదారుల్లో అవగాహన కల్పించి తరవాత చర్యలకు పూనుకుంటున్నారు. ఇలా సవరించిన చట్టంలో 17 రకాల ఉల్లంఘనలకు గరిష్ఠంగా 1 నుంచి 5 పాయింట్లు నమోదు చేస్తున్నారు. ఈ విధానాలు అమల్లోకి వచ్చాక వాహనదారుల్లో అవగాహన, బాధ్యత పెరిగిందని అంచనాకు వచ్చారు. రెండేళ్ల కాలంలో 12 పాయింట్లను దాటితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను ఏడాది పాటు రద్దు చేస్తారు. పునరుద్ధరించిన అనంతరం మళ్లీ 12 పాయింట్లు దాటితే ఈసారి రెండేళ్లు.. మళ్లీ పునరావృతమైతే మూడేళ్లపాటు రద్దు చేస్తున్నారు. లెర్నింగ్‌ సమయంలో 5 పాయింట్లు దాటినా లైసెన్స్‌ రద్దవుతుంది. రద్దయిన సమయంలో వాహనం నడిపితే జైలుకు పంపిస్తారు. ఈ విధానంలో మందుబాబులు, గొలుసు దొంగలతోపాటు ప్రమాదాల్లో మరణాలకు కారకులయ్యే వారికి చుక్కలు కనిపించనున్నాయి. ఈ కేసుల్లో చిక్కిన వారి పేరిట గరిష్ఠంగా 5 చొప్పున పాయింట్లు నమోదు చేస్తారు. రేసింగ్‌లకు పాల్పడే వారికి మూడు పాయింట్లు జమ కానున్నాయి.ముందుగా అవగాహన కల్పించి.. తర్వాత తనిఖీలు చేపడతామని  తెలిపారు. సీటుబెల్టు లేదా హెల్మెట్‌  ధరించకుంటే కూడా పాయింట్ల పట్టికలో చేరుస్తారు. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాక నగరంలో మార్పు కనిపిస్తోందని ట్రాఫఙక్‌ విభాగం అధికారులు అంటున్నారు. ముఖ్యంగా హెల్మెట్‌,లైసెన్స్‌ తదితర అంశాల్లో ఖచ్చింతంగా ఉంటున్నారు.