Thursday, 5 November 2026

పూర్తి కావచ్చిన రైతుబీమా వివరాల సేకరణ

ఆన్‌లైన్‌ చేస్తున్న అధికారులు

హైదరాబాద్‌,జూలై19(జ‌నం సాక్షి): జిల్లాలో రైతుబంధు బీమా వివరాలు నమోదు పక్రియ పూర్తి కావస్తోంది. గత నెల 10 నుంచి ప్రారంభమైన కార్యక్రమంలో కొంత ఆలస్యం అయినా పూర్తి చేయడంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామాల్లోని రైతు కుటుంబాల్లో నామినీని నిర్ధారణ చేస్తూ నామినేషన్‌ ఫారంపై పట్టాదారు సంతకం సేకరిస్తున్నారు. మండలాల్లో వ్యవసాయ శాఖ ఏడీఏలు, ఏవోలు గ్రామాల్లో పర్యటిస్తూ ఈ పక్రియను పరిశీలిస్తున్నారు. రోజు ఎన్ని గ్రామాల్లో ఎంత మంది రైతుల వివరాలను పత్రాల్లో పొందుపర్చారనే విషయాలను తీసుకుని ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడూ నివేదికలు అందజేస్తున్నారు.గ్రామాల్లోని సర్పంచ్‌లు, రైతు సమన్వయ సమితుల సభ్యులు అధికారులకు సహకారం అందిస్తున్నారు.రైతుబంధు బీమా పథకంలో గ్రామాల్లోని 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉన్న రైతులు అర్హులు కాగా ఈ విషయంలో సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా రు. ఆధార్‌కార్డులోని వయస్సును పరిగణలోకి తీసుకుంటున్నారు. రైతులకు బీమా పథకం ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ప్రారంభంకానుండగా ఈ లోపు జిల్లాలో ఇందుకు సంబంధించిన పక్రియను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. భూ సమగ్ర సర్వేలో భాగంగా అధికారులు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. రెవెన్యూ గ్రామాల్లోని పట్టాదారు పాసుపుస్తకాల్లోని వివరాల ఆధారంగా వ్యవసాయ శాఖ సిబ్బంది ముద్రించిన బీమా పత్రాల్లో అవసరమైన సమాచారాన్ని తీసుకుంటున్నారు. రైతులను కలిసిన వ్యవసాయ శాఖ సిబ్బంది వివరాలను సేకరించారు. రైతులకు సంబంధించిన నామినీ పేర్లు, ఆధార్‌ ఇతర వివరాలను సేకరించారు. జిల్లాలో 96 వ్యవసాయ క్లస్టర్‌లు ఉండగా వ్యవసాయ విస్తరణ అధికారులు తమ క్లస్టర్‌ల పరిధిలోని రైతులను కలిసి బీమా వివరాలను తీసుకుంటున్నారు. గ్రామాల్లోని రెండు లేదా మూడు శివారు ప్రాంతాల్లో రైతులకు భూములు ఉన్నందున పట్టాపాసు పుస్తకాల సంఖ్య కంటే బీమా కిందికి వచ్చే రైతుల సంఖ్య తక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. జిల్లాలోని రైతుబంధు బీమా పక్రియను నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేసి సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఉన్నతాధికారులు అందజేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.