హైదరాబాద్,జూన్4(జనం సాక్షి ): నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక తొమ్మిది సార్లు ఎక్సైజ్ సుంకం పెంచారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో పన్ను రేటు లక్షా 30వేల కోట్లుఉంటే… ఇప్పుడు 2. 70 లక్షల కోట్లు వరకు పెంచారని విమర్శించారు. తాను పెట్రోలియం మంత్రిగా ఉన్నప్పుడు… బ్యారల్ క్రూడాయిల్ ధర 120 డాలర్లుగా ఉందని, ఇప్పుడు 75 డాలర్లకు తగ్గిందని ఆయన తెలిపారు. క్రూడాయిల్ ధర తగ్గినప్పుడు వినియోగదారుడిపై భారం తగ్గించాలే తప్ప.. ఎలా పెంచుతారని ఆయన ప్రశ్నించారు. మోదీకి రాక్షసానందం పొందే అలవాటు ఉన్నట్లుందని జైపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సబ్సిడీల నుంచి కేంద్రానికి 3.70 లక్షల కోట్లు లాభం అని ఆయన అన్నారు. మధ్యతరగతి ప్రజలపై మోదీ యుద్ధం చేస్తున్నారని జైపాల్‌రెడ్డి మండిపడ్డారు.




