గ్రామాల్లో తిరుగుతున్న కొత్త బిచ్చగాళ్లు..
పోరు దొంగల రేటు ఎకరాకు 16వేలు…
చట్టానికి చుట్టాల రేటు రూ.25వేలు…
పోడు భూముల సర్వేను ఆసరా చేసుకున్న వసూల్ రాజాలు…
పేద ప్రజల జేబు గుల్ల చేస్తున్న దర్జా దొంగలు…
వెంకటాపూర్ (రామప్ప) అక్టోబర్18 (జనం సాక్షి):-
తాతల కాలం నుంచి అటవీ భూములను పోడుచేసి జీవిస్తున్న రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ కింద హక్కు పత్రాలు ఇచ్చేందుకు భూములను సర్వే చేస్తుండగా ఏకంగా పట్టాలిప్పిస్తామంటూ వసూళ్ల దందాకు తెరతీసి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్న దర్జా దొంగలు గ్రామాల్లో తిష్ట వేశారు. ఇన్నాళ్లు పోరాటాల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్న కొందరు ఎకరాకు రూపాయలు 16 వేలు ఇస్తే పట్టా ఇప్పిస్తామని ఇప్పటికే సుమారు 500 మంది వద్ద వసూలు చేసినట్లు సమాచారం.నల్లకోటు వేసుకుని న్యాయం చేయాల్సిన మరికొందరు ఎకరాకు రూపాయలు 25వేల చొప్పున అమాయక నిరుపేద ప్రజల నుంచి ఇప్పటికే కోట్లరూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.ములుగు జిల్లాలోని అమాయక నిరుపేదలు,గిరిజనుల జీవన విధానాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాల్సింది పోయి పోడు చేసిన భూములకు సైతం హక్కు పత్రాలు వచ్చేది లేనిది తెలియని అయోమయంలో ఉన్న వారిని ఆసరా చేసుకుని వసూలు చేస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ పోడు పట్టాలిప్పిస్తాం.పోడు పట్టాలిప్పిస్తాం…అంటూ కొత్త దందాకు తెర తీసిన కొత్త బిచ్చగాళ్ళ ను ప్రోత్సహించే విధంగా కొందరి అధికారుల తీరు ఉండడం ఇంటిలిజెన్స్, విజిలెన్స్ అధికారుల పనితీరుపై అనుమానాలను కలిగిస్తోంది.
ములుగు జిల్లాలో పోడుపట్టాకు ఒక్కోచోట ఒక్కో రేటు…
2005 వరకు పోడు చేసిన భూములను గుర్తించి సాగు చేసుకుంటున్న రైతులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు అందించేందుకు సర్వే జరుగుతుంది. 2005 నుంచి 2022 వరకు పోడు చేసిన భూములను కూడా హక్కు పత్రాలు ఇప్పించేందుకు ప్రతి మండలంలోనూ, గ్రామంలోనూ దళారులు ముందుకు వస్తున్నారు. పోడు భూముల సర్వే ప్రారంభించడంతో మొదలైన దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. పట్టా వస్తుందని నమ్మకంతో ఎంతైనా ఇచ్చేందుకు నిరుపేదలు అప్పులు చేసి మరీ దళారుల చేతిలో డబ్బులు పెడుతున్నారు. ఇదే అదనుగా రికార్డులో లేకున్నా ,దరఖాస్తు చేసుకోకున్నా పట్టా ఇప్పిస్తామంటూ మరికొందరు మోసం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోడు భూములను సాగు చేసుకుంటున్న చక్రవర్తి పల్లి,లక్ష్మీదేవిపేట తదితర గ్రామాలలో రైతులను మభ్యపెట్టి వసూలు చేసినట్లు పక్కా సమాచారం.చక్రవర్తి జంగిల్ తో పాటు అడవి రంగాపురం గ్రామపంచాయతీ పరిధిలోని బండ్లపాడు భూములపై ఉన్న సమస్యలను తొలగించి పట్టాలిప్పించేందుకు నల్లకోటు ముసుగులో కోట్ల రూపాయలు ముంచేందుకు సిద్ధమైన వ్యక్తులు ఇప్పటికే భారీగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.జిల్లా వ్యాప్తంగా వసూళ్ల దందాకు దర్జాగా శ్రీకారం చుట్టినా వాటాలు వేసుకునేందుకు సిద్ధమవుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరించడంతో అమాయక ప్రజలు ఆగమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
వసూల్ రాజాల జేబులు నింపుతున్న పోడు భూముల సర్వే…
పోడు భూముల సర్వే వసూల్ రాజాల జేబులు నింపుతోంది. ప్రతి గ్రామంలోనూ పోడు రైతులు ఉన్నారు. వారి నుంచి అందిన కాడికి దోచుకునేందుకు సిద్ధమై పోడు సర్వే పూర్తయితే ఎంత డబ్బు ఇచ్చినా పట్టాలు రావని ,ఈలోపే రికార్డుల్లో నమోదు చేసుకోవాలని అధికారులకు ఎంతో కొంత ఇవ్వాల్సి ఉంటుందని నమ్మిస్తున్నారు. అవసరమైతే భూమి లేకున్నా నీ పేరుపై పట్టా ఇస్తామని, ప్రభుత్వాలు అందించే మిగతా పథకాలు అయినా అందుతాయని చెప్తూ భారీగా వసూలు చేస్తున్న విషయం అధికారులకు తెలియడం లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.ఇప్పటికైనా సంబంధిత వసూల్ రాజాలకు చెక్ పెట్టకపోతే నిరుపేదలు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వసూళ్లకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.అప్పుడే నిజమైన పోడు రైతులకు న్యాయం జరుగుతుందని పలువురు అధికారులను వేడుకుంటున్నారు.
|
ReplyForward
|




