Wednesday, 4 November 2026

పోచారం, తనది అన్నదమ్ముల అనుబంధం

– స్పీకర్‌ను అభినందించిన కడియంశ్రీహరి

హైదరాబాద్‌, జనవరి19(జ‌నంసాక్షి) : శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిది తనది అన్నదమ్ముల అనుబంధమని, రాజకీయాల్లో సుధీర్ఘ అనుభవం కలిగిన పోచారంను స్పీకర్‌గా ఎంపిక చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ రెండో స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్‌రెడ్డిని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శనివారం అభినందించారు. స్పీకర్‌ ఛాంబర్‌ లో పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని కడియం శ్రీహరి కలిశారు. పోచారం శ్రీనివాసరెడ్డితో తనకు అన్నదమ్ముల అనుబంధం ఉందని ఈ సందర్భంగా కడియం శ్రీహరి గుర్తు చేసుకున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డికి ఉన్న అపారమైన రాజకీయ, పాలనా అనుభవం తెలంగాణ స్పీకర్‌ గా శాసనసభ నిర్వహణలో బాగా ఉపయోగపడుతుందన్నారు. ఆయనకు ఉన్న ఓపిక సభ్యుల చెప్పిన వాటిని వినడంలో, ఆయనకున్న సమర్థత వాటి పరిష్కారంలో గొప్పగా ఉపయోగపడనుందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారని, వ్యవసాయాన్ని పండగ చేస్తున్నారని అందుకు నిదర్శనంగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రైతును, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని ఇప్పుడు రాష్ట్రంలో అత్యున్నత పదవిలో కూర్చోబెట్టి రైతుకు తమ ప్రభుత్వం ఇస్తున్న గౌరవాన్ని చాటి చెప్పారని తెలిపారు. ఇది రైతు ప్రభుత్వమని రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.