Thursday, 5 November 2026

ప్రగతిభవన్‌ ముట్టడికి.. 

బీజేపీ నేతల యత్నం
– పలు ప్రాంతాల్లో భారీగా తరలివెళ్లేందుకు యత్నించిన బీజేపీ శ్రేణులు
– అడ్డుకొని అదుపులోకి తీసుకున్న పోలీసులు
– పరిపూర్ణానంద స్వామిపై బహిష్కరణ ఎత్తివేయాలని డిమాండ్‌
– సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వటం లేదు
– అందుకే నిరసనగా ప్రగతిభవన్‌కు వెళ్తున్నాం
– పరిపూర్ణానందపై బహిష్కరణ ఎత్తివేసి ప్రభుత్వం తప్పును సరిదిద్దుకోవాలి
– బీజేపీ నేతలు లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి
– లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
– పోలీసుల చర్యలపై బీజేపీ శ్రేణుల ఆగ్రహం
హైదరాబాద్‌, జులై17(జ‌నం సాక్షి ) : శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కణ చేయడంపై బీజేపీ ఆందోళన తీవ్రతరం చేసింది. పరిపూర్ణానంద స్వామిపై విధించిన నగర బహిష్కరణను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ.. మంగళవారం ‘ఛలో ప్రగతిభవన్‌’కు బీజేపీ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. దీనిపై సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ఎమ్మెల్యేలంతా ర్యాలీగా బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యాలయానికి చేరుకునేందుకు సిద్ధమవుతున్న బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావులను పోలీసులు వారి నివాసంలోనే గృహ నిర్బంధం చేశారు. పోలీసుల చర్యలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చలో ప్రగతిభవన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన బీజేపీ శాసనపక్ష నేత కిషన్‌రెడ్డిని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద అరెస్ట్‌ చేసి కిషన్‌ బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అసెంబ్లీ వైపు వెళ్తున్నారన్న సమాచారం పోలీసులకు అందడంతో  ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద అరెస్ట్‌ చేసి రాంగోపాల్‌ పేట  పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బద్దం బాల్‌రెడ్డిని  అసెంబ్లీ గేటు ముందు అరెస్ట్‌ చేసిన పోలీసులు బొల్లారం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
ఈ నేపథ్యంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని ఆయా స్టేషన్‌లకు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు పోలీసుల చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిపూర్ణానంద స్వామిని బహిష్కరించడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని, ఆయన ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదని కిషర్‌ రెడ్డి అన్నారు. శ్రీరాముడిని అవమానం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, శాంతియుతమైన పాదయాత్ర చేపట్టినందుకు నగర బహిష్కరణ చేయడం చట్ట వ్యతిరేకమని ఆయన అన్నారు. బహిష్కరణ అనేది నిజాం కాలంలో పెట్టిన పోలీస్‌ చట్టమని, కేసీఆర్‌ నిజాం పారిపాలనలా అమలు చేశారని, దీన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన తప్పును సరిద్దుకుని, స్వామికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, బహిష్కరణ వేటును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.