ప్రజలకు అందుబాటులో మరో నాలుగు జోన్లు
హైదరాబాద్,జనవరి23(జనంసాక్షి): మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) సేవలు ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండేలా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అనుమతులు, ఇతర పనుల కోసం తార్నాకలోని ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రజల సౌకర్యార్థం.. పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పుడున్న నాలుగు జోన్లకు అదనంగా మరో నాలుగింటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందనే అంశంపై కసరత్తు చేసి తాజాగా ఆ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు.ఈ నేపథ్యంలో అధికారులు పరిపాలన వికేంద్రీకరణపై దృష్టి సారించారు. ఎలా చేస్తే బాగుంటుందో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. కొత్తగా శావిూర్పేట్, పెద్ద అంబర్పేట్, ఇబ్రహీంపట్నం, పటాన్చెరు జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో జోన్ల సంఖ్య ఎనిమిదికి పెరగనుంది. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఏఏ మండలాలను.. ఏఏ జోన్లలో చేర్చాలో కసరత్తు పూర్తి చేశారు. ఇందుకు అనుమతివ్వాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించారు.ఏడు జిల్లాలు.. 70 మండలాలు.. 12 మున్సిపాలిటీలు.. 826 గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి. విస్తీర్ణం 7,257 చ.కివిూ. ఆయా ప్రాంతాలను మేడ్చల్, ఘట్కేసర్, శంషాబాద్, శంకర్పల్లి జోన్లుగా విభజించారు. కొత్త జిల్లాలు రావడంతో పరిధి పెరిగింది. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కావడం లేదు. ఉన్నవారేమో ఉద్యోగ విరమణ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణలేమి అక్రమార్కులకు వరంగా మారింది. అనుమతి లేని లేఅవుట్లు, భవనాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. సంస్థ ఖజానాకు గండి పడుతోంది. లేఅవుట్లు, భవనాలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు అనుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా… కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా చక్కర్లు తప్పడం లేదు. ఆ దరఖాస్తుదారులే కాకుండా ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, ఇతర పనుల నిత్యం ఎంతో మంది వస్తుంటారు. ఎంతో దూరం నుంచి తార్నాకలోని ప్రధాన కార్యాలయానికి రావడం ఇబ్బందిగా మారింది.




