Wednesday, 4 November 2026

ప్రజాకూటమిలో సీట్ల పీటముడి

అతివిశ్వాసంతో కాంగ్రెస్‌..ఆగ్రహంతో కూటమి

కాంగ్రెస్‌ తీరుపై టిఎస్‌ఎస్‌, సిపిఐ ఆగ్రహం

సొంతంగానే పోటీ చేసే యోచనలో ఇరు పార్టీలు

కోరని సీట్లు కట్టబెట్టే యోచనలో కాంగ్రెస్‌

హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రజాకూటమిలో సీట్ల కుంపటి చిచ్చు రేపుతోంది. నిన్నిటికి నిన్న సిపిఐ కాంగ్రెస్‌ తీరుతో విసిగి వేసారి పోయామంటూ తాము పోటీ చేసే 9సీట్లను ప్రకటించుకుంది. ఒంటరిగానే పోటీ చేస్తామని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చింది. ఇప్పుడు అదే కోవలో తెలంగాణ జనసమితి కూడా మండిపడింది. కోరని సీట్లు చూపిఒ ఇక్కడే పోటీ చేయండన్న ర ఈతిలో చేస్తున్న ప్రకటనపై మండి పడుతోంది. ఏదో బిచ్చం వేస్తున్నట్లుగా కాంగ్రెస్‌ తీరు ఉందని ఇరు పార్టీల నేతలు మండిపడుతున్నారు. మరోవైపు రాహుల్‌ వద్ద మాట్లాడిన దానికి భిన్నంగా కాంగ్రెస్‌ నేతలు వ్యవహరిస్తున్నారు. తామే గెలుస్తామన్న అతి విశ్వాసంతో పొత్తు ధర్మానికి తూట్లు పొడవాలని చూస్తున్నారు. చూస్తుంటే ఈ పొత్తు పొడుస్తుందా లేక చితికి పోతుందా అన్న అనుమానాలు దీపావళికి రోజుతో తేలనుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలంగాణ జనసమితి (తెజస) కోర్‌ కమిటీ కీలక భేటీలో కాంగ్రెస్‌ సీట్ల ప్రతిపాదనలను చర్చించింది. కాంగ్రెస్‌ ఇచ్చిన సీట్ల జాబితాపై నేతలు చర్చించారు. ఈ భేటీ అనంతరం ఆ పార్టీ అధికార ప్రతినిధి వెంకట్‌ రెడ్డి విూడియాతో మాట్లాడారు. తెజసకు కాంగ్రెస్‌ తొమ్మిది సీట్లు ప్రతిపాదించిందన్నారు. తొమ్మిది సీట్లలో తాము అడగని స్థానాలు కూడా ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ ప్రతిపాదించిన సీట్లపై కోర్‌ కమిటీలో చర్చించినట్టు చెప్పారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కాంగ్రెస్‌ను సంప్రదిస్తామన్నారు. మరోవైపు, మహబూబ్‌నగర్‌ టికెట్‌ను రాజేందర్‌రెడ్డికి కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ సమావేశం వద్ద అనుచరులు నిరసన వ్యక్తంచేశారు. కూటమిలో భాగస్వామి అయిన టీజేఎస్‌ పార్టీకి కేటాయించాలనుకున్న నియోజకవర్గాల జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అందజేశారు. దీనిపై టీజేఎస్‌ అధినేత కోదండరామ్‌ మాట్లాడుతూ, పార్టీలో చర్చించిన తర్వాత జాబితాపై స్పందిస్తామని చెప్పారు. మరోవైపు అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు పార్టీ సీనియర్‌ నేతలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీలు ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక పక్రియపై దిల్లీలో సుదీర్ఘ కసరత్తు కొనసాగుతోంది. కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లో స్కీన్రింగ్‌ కమిటీ ఛైర్మన్‌ భక్తచరణ్‌ దాస్‌ నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి ఆర్‌సీ కుంతియా, కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, జానా రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, రేవంత్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, షబ్బీర్‌ అలీ హాజరయ్యారు. ఇప్పటికే 57 మంది అభ్యర్థులను కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. మిగతా అభ్యర్థుల జాబితాపై ఈ భేటీలో కసరత్తు చేస్తున్నారు. మిత్ర పక్షాలకు కేటాయించాల్సిన స్థానాల పైనా సమాలోచనలు చేస్తున్నారు. సామాజిక వర్గాలవారీ ప్రాతినిధ్యంపైనా నేతలు ఈ భేటీలో దృష్టిసారించనున్నారు. మహా కూటమిలో సీట్ల కేటాయింపు అంశం ఓ కొలిక్కివచ్చాక ఒకేసారి 119 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్‌ నేతలు యోచిస్తున్నారు. ఇటు సీపీఐ అగ్రనేతలు ఇవాళ అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఈ భేటీకి సురవరం సుధాకర్‌ రెడ్డి, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకట్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. మహాకూటమిలో సీట్ల విషయంలో తాడో పేడో తేల్చుకోవాలని సీపీఐ భావిస్తోంది. మహాకూటమి ఏర్పాడి

ఇన్ని రోజులైనా ఇంతవరకు సీట్ల సర్దుబాటు కాలేదు. దీంతో సీపీఐ, టీజేఎస్‌ కాంగ్రెస్‌ వ్యవహారంపై మండిపడుతున్నాయి. తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తున్నాయి. గత రెండు రోజులుగా కాంగ్రెస్‌ కూటమి పార్టీలతో భేటీలు నిర్వహించింది. సీట్ల సర్దుబాటు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు. దీపావళి పండుగ తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.