Friday, 6 November 2026

ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి

– కన్నడ గవర్నర్‌ నిర్ణయం అప్రజాస్వామిక 
– గన్‌పార్క్‌ వద్ద కాంగ్రెస్‌ నేతల ఆందోళన
హైదరాబాద్‌, మే18(జ‌నం సాక్షి ) : కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. కర్ణాటక గవర్నర్‌ వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ  శుక్రవారం గన్‌పార్క్‌ వద్ద నిర్వహించిన ‘సేవ్‌ డెమోక్రసీ’ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శలో  జానారెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి, షబ్బీర్‌అలీ, వి.హెచ్‌, డి.కె. అరు, గీతారెడ్డి తదితరులు పాల్గన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మెజారిటీ లేకున్నా గవర్నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం అప్రజాస్వామికమని విమర్శించారు. అంతేగాక ప్రస్తుతం బలమైన కూటమిగా ఉన్న కాంగ్రెస్‌-జేడీఎస్‌కు తక్షణమే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కర్ణాటకలో గవర్నర్‌ బీజేపీ నేతగా వ్యవహరించారని, అత్యధిక స్థానాలు కలిగి ఉన్న కాంగ్రెస్‌, జేడీఎస్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా గవర్నర్‌ యడ్యూరప్పతో ప్రమాణ స్వీకారం చేయించారన్నారు. గవర్నర్‌ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఆశ్చర్యం వ్యక్తమవుతుందన్నారు.  బలపరీక్షకు వారం రోజులుగా గడువును బీజేపీ అడిగితే గవర్నర్‌ మాత్రం 15రోజులు ఇవ్వటం రాజ్యాంగ విరుద్దమన్నారు. సుప్రింకోర్టు నిర్ణయంతో బీజేపీ ఆగడాలకు చెక్‌ పడినట్లయిందని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా గుణపాఠం తప్పదని మరోసారి సుప్రిం తీర్పు తేటతెల్లం చేసిందన్నారు. శనివారం జరిగే బలపరీక్షలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూటమి విజయం సాధించటం తధ్యమన్నారు. కర్ణాటకలో బీజేపీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా గన్‌పార్క్‌ వద్ద నిర్వహించిన సేవ్‌ డెమోక్రసీ నిరసన కార్యక్రమానికి భట్టి ఇతర కాంగ్రెస్‌ నేతలతో కలిసి పాల్గొన్నారు.
———————–