హైదరాబాద్,జూన్15(జనం సాక్షి): సినిమా పరిశ్రమలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా పరిష్కరించేందుకు ముందుంటానని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ చెప్పారు. సీఎం కేసీఆర్ తనకు చాలా సహకారం అందించారని తెలిపారు. రామకృష్ణ గౌడ్, సినీ నటుడు సుమన్‌తో పాటు 18 మందికి యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసింది. హైదరాబాద్ హబ్సిగూడలో నిర్వహించిన సామాజిక డాక్టరేట్ అవార్డ్స్-2018 కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య వీరిని సన్మానించారు.తనకు డాక్టరేట్ రావడం పట్ల రామకృష్ణగౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. తాను సిద్దిపేట లోని మెట్ పల్లి గ్రామస్తుడనని, తాను గ్రామ సర్పంచ్ గా ఉన్నప్పటి నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానన్నారు. 1990లో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టానని, ఇండస్ట్రీలోని పేదలకు చాలా సహాయ కార్యక్రమాలు చేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ ఫ్రాన్సిస్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.




