Monday, 2 November 2026

ప్రధాన ఆలయాలకు బాస్‌లుగా ఐఎఎస్‌లు?

తిరుమల తరహాలో అభివృద్దికి ఆటంకాలు లేకుండా చర్యలు

పరిశీలనలో యాదాద్రి,భద్రాద్రి, బాసర, వేములవాడ

త్వరలోనే నిర్ణయం తీసుకోనున్న సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): తిరుమల తరహాలో దేవాలయాలను అభివృద్ది చేసి ముందుకు వెళుతున్న తెలంగాణ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేస్తూ అభివృద్ది చేస్తోంది. ప్రధాన దేవాలయాలకు భారీగా నిధులు విడుదల చేసింది. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మిస్తోంది. అలాగే భద్రాచలం, వేములవాడ, బాసర ఆలయాలకు కూడా నిధులు విడుదల చేసింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆగమోక్తంగా వీటిని అభివృద్ది చేస్తోంది. ఈ దశలో వీటి నిర్వహణ సక్రమంగా ఉండేలా చూస్తోంది. ఇందులో భాగంగా సమర్తులైన అధికారులను ఇవోలుగగా నియమించి వాటి పనుల్లో వేగం పెంచాలని చూస్తోంది.

టిటిడికి ఐఎఎస్‌ అధికారి ఇవోగా ఉండగా తెలంగాణలో ఒక్క ఆలయానికి కూడా అలా ఎవరిని నియమించలేదు. యాదాద్రి నిర్మాణం పూర్తవుతున్న క్రమంలో అక్కడ ఐఎఎస్‌ అధికారిని ఇవోగా నియమించాలన్న ఆలోచనలో సిఎం కెసిఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. వందల కోట్ల నిధులను వెచ్చిస్తున్న క్రమంలో సమర్థులైన అధికారులను నియమించడం ద్వారా ఆలయాల పవిత్రతతో పాటు ప్రత్యేకతను చాటాలని చూస్తున్నారు. అందుకే ప్రధాన ఆలయాలుగా తెలంగాణలో ప్రసిద్ది చెందిన యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, బాసరలకు ఐఎఎస్‌ స్థాయి అధికారులను నియమించాలన్న యోచనలో ఉనట్లు సమాచారం.దీనికి మంత్రులుకూడా సుముఖంగా ఉన్టన్లు సమాచారం. బాగా పేరుండి కష్టపడుతున్న వారిని ఈఆలయాలకు నియమించే అవకాశాలున్నాయి. ఆలయాల పటిష్ట నిర్వహణకు ఇదే మార్గమని భావిస్తున్నారు.భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవోగా ఐఏఎస్‌ అధికారిని నియమించాలనే భావనలో జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల కూడా ఉన్నారని ప్రచారంలోకి వచ్చింది. దీర్ఘకాల ప్రయోజనాల నిమిత్తం ఈవోగా ఐఎఎస్‌లను నియమించే అవకాశమున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఆయా ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించిన క్రమంలో వాటిని వినియోగించే సమయంలో ఐఏఎస్‌ స్థాయి అధికారి ఉండాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అభివృద్ధిని కాంక్షించే ఐఏఎస్‌ అధికారికి బాధ్యతలు అప్పగించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఇందుకు సంబందించిన ప్రాథమిక కసరత్తు పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఆలయాల అభవృద్ది,విస్తరణ పనులకు ఎటువంటి ఆటంకాలు రాకుండా, పనులు పారదర్శకంగా, వేగంగా జరిగేందుకు ఈ నియామకం ఎంతో దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన ఆలయాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారిని నియమిస్తే అంతా సానుకూలంగా ఉండే అవకాశముంది.