తెరాస కార్యక్రమాలుగా నిర్వహిస్తుంది
– ప్రొటోకాల్ పాటించడం లేదు
– ప్రొటోకాల్ ఉల్లంఘనపై సీఎస్, స్పీకర్‌లకు ఫిర్యాదు చేస్తాం
– కాంగ్రెస్‌లో వచ్చేందుకు ఇతర పార్టీల నేతలు సిద్ధంగా ఉన్నారు
– టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఆగస్టు3(జనం సాక్షి) : ప్రభుత్వ కార్యక్రమాలను తెరాస నేతలు తమ సొంత కార్యక్రమాలుగా నిర్వహిస్తున్నారని, ప్రొటోకాల్ కూడా పాటించకుండా ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇతర పార్టీల నుంచి చాలా మంది కాంగ్రెస్‌లో చేరుతామంటున్నారని చెప్పారు. అలాంటి వారిని పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించామన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నమ్మి వస్తున్న వారిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. పార్టీలో చేరే వారి పేర్లు ఇప్పడు చెప్పమన్నారు. పేర్లు చెబితే అధికార పార్టీ బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చేస్తుందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను టీఆర్‌ఎస్.. పార్టీ ప్రోగ్రామ్స్‌గా నిర్వహిస్తోందని భట్టి ఆరోపించారు. మథిర నియోజకవర్గంలో కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే.. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులనే కలెక్టర్లుగా చేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీలు.. దొంగతనంగా అధికారులు చార్జ్ తీసుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై సీఎస్, స్పీకర్‌లకు ఫిర్యాదు చేస్తానని భట్టి తెలిపారు.
————————————–




