Thursday, 5 November 2026

ప్రాజెక్టుల అంచనా వ్యయాలు..

ఎందుకు పెరిగాయి?
– రాహుల్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పండి
– సమాధానమివ్వకుండా.. తప్పుడు మాటలతో తెరాస నేతలు పక్కదోవ పట్టిస్తున్నారు
– హరీష్‌, కేటీఆర్‌ కలిసి వచ్చినా మేం చర్చకు సిద్ధం
– లుచ్చాగాళ్లు విూరా.. మేమా తేల్చుదాం
– తుమ్మలకు కొత్త, పాత ప్రాజెక్టులకు తేడా తెలియడం లేదు
– ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే గుణపాఠం తప్పదు
– విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క
హైదరాబాద్‌, ఆగస్టు16(జ‌నం సాక్షి) : ప్రాజెక్టుల అంచనా వ్యయాలు ఎందుకు పెరిగాయో చెప్పాలని రాహుల్‌ ప్రశ్నిస్తే.. తెరాస నేతలు ఉలిక్కి పడుతున్నారని, అసలు ప్రశ్నకు సమాదానం చెప్పకుండా లుచ్చాలు, బచ్చాలు అంటూ మాట్లాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క తెరాస నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌ వ్యాఖ్యలపై భట్టి సీరియస్‌గా స్పందించారు. ముఖ్యంగా ప్రాజెక్టుల రీడిజైన్లపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను మంత్రులు తప్పుబట్టడంపై భట్టి మంత్రులను నిలదీశారు. రాహుల్‌ లేవనెత్తిన అంశాల్లో ఏది తప్పో సమాధానాలు చెప్పాల్సింది పోయి, రకరకాల అంశాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాత ప్రాజెక్టుల పేర్లు ఎందుకు మారాయని, అంచనా వ్యయాలు ఎందుకు పెరిగాయో చెప్పాలని భట్టి ప్రభుత్వానికి సవాల్‌ విసిరాచు. వీటిపై చర్చకు తాము సిద్ధమేనని, మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌ వేర్వేరుగా వచ్చినా, కలిసి వచ్చినా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని భట్టి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల వ్యయం ఉన్నట్టుండి ఎందుకు పెంచారని ప్రశ్నించారు. రేటు పెరిగినా తగ్గినా ప్రభుత్వానికి సంబంధం లేదని, కాంట్రాక్టర్‌ ప్రాజెక్ట్‌ కట్టి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుందన్నారు. లేకుంటే కాంట్రాక్టర్‌ నుండి డబ్బులు రికవరీ చెయొచ్చని, బ్లాక్‌ లిస్ట్‌ లో పెట్టొచ్చని భట్టి విక్రమార్క అన్నారు. వాస్తవాలు రాహుల్‌ గాంధీ అడిగితే తప్పా అంటూ ప్రశ్నించారు. సమాధానాలు ఇవ్వడం మానేసి, ఏదేదో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు చాలా కాలంగా మంత్రిగా పనిచేశారని, కానీ ఆయనకు కొత్త ప్రాజెక్ట్‌ కి, పాత ప్రాజెక్ట్‌ కి తేడా తెలియదని సెటైర్లు వేశారు. కేటీఆర్‌ మమ్మల్ని లుచ్చాలు అని ప్రాజెక్ట్‌ లపై చర్చను పక్కదోవ పట్టించాలి చూస్తున్నారని భట్టి ఆరోపించారు. అడ్డగోలుగా మాట్లాడటం మానుకోవాలని, లేకుంటే గుణపాఠం తప్పదని భట్టి విక్రమార్క హెచ్చరించారు.
కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎందుకు లుచ్చాలో మంత్రి కేటీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇవ్వనందుకు లుచ్చాలమా, 12 శాతం మైనారిటీలకు రేజర్వేషన్‌ ఇస్తామని ఇవ్వనందుకు లుచ్చాలమా, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామని ఇవ్వనందుకు లుచ్చాలమా, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామని ఇవ్వనందుకు లుచ్చాలమా,  మహిళలకు వడ్డీలేని రుణాలు ఇచ్చినందుకు లుచ్చాలమా, ఇందిరమ్మ ఇళ్లు కట్టించినందుకు లుచ్చా గాళ్లమా అంటూ టీఆర్‌ఎస్‌ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాగ్దానాలు ఇచ్చి మర్చిన టీఆర్‌ఎస్‌ నేతలకే అది వర్తిస్తుందని భట్టి పేర్కొన్నారు. ఇప్పటికైన హరీష్‌రావు, కేటీఆర్‌లు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, లేకుంటే గుణపాఠం తప్పదని భట్టి విక్రమార్క హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్‌ పార్టీనేనని, తెరాస నేతలు తిన్న ప్రతి పైసను కక్కిస్తామని హెచ్చరించారు.
————————————