‘‘రాహుల్.. వీళ్లు నా బట్టలు లాగుతున్నారు’’ అంటూ ప్రియాంక ఆవేదన
మహిళా ఎంపీకే ఇలాంటి పరిస్థితి వస్తే.. ప్రజాస్వామ్య నిరసనల్లో భద్రత, గౌరవం మాటేమిటి?
న్యూఢిల్లీ, జనం సాక్షి:
ఢిల్లీలో ప్రతిపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. నిరసనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో ప్రియాంకను పోలీసులు, భద్రతా సిబ్బంది ఈడ్చుకుంటూ వాహనం వైపు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఆమె చీర లాగబడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఈ తోపులాట సమయంలో తీవ్ర ఆందోళనకు గురైన ప్రియాంక తన సోదరుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ‘‘రాహుల్.. యే మేరే కప్డే ఉతార్ రహే హై’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు వైరల్ వీడియోల్లో వినిపిస్తోంది. అంటే ‘‘రాహుల్.. వీళ్లు నా బట్టలు లాగుతున్నారు’’ అని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ప్రియాంక గాంధీ సాధారణ నిరసనకారిణి కాదు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మనవరాలు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మనవరాలు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, ప్రస్తుతం లోక్సభ సభ్యురాలు. ఒక మహిళా ప్రజాప్రతినిధిని అదుపులోకి తీసుకునే సమయంలో ఆమె గౌరవం, భద్రతకు భంగం కలగకుండా పోలీసులు మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందనే ప్రశ్నలు ఈ ఘటనతో తలెత్తుతున్నాయి.
నిరసనను నియంత్రించేందుకు పోలీసులకు చట్టబద్ధమైన అధికారాలు ఉండవచ్చు. కానీ ప్రజాప్రతినిధిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఆమె దుస్తులు లాగబడే పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్నది సమాధానం కావాల్సిన ప్రశ్న. ఒక మహిళా ఎంపీనే ‘‘నా బట్టలు లాగుతున్నారు’’ అంటూ తన సోదరుడిని పిలవాల్సిన పరిస్థితి ఏర్పడితే, సాధారణ మహిళలు పోలీసు చర్యల సమయంలో తమ గౌరవం, భద్రతపై ఎలా నమ్మకం పెట్టుకోవాలన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది.
ప్రజాస్వామ్యంలో నిరసనను అడ్డుకోవచ్చు. చట్టాన్ని అమలు చేయవచ్చు. కానీ ఒక మహిళ గౌరవాన్ని కాపాడటం కూడా అదే వ్యవస్థ బాధ్యత కాదా?
ప్రియాంక గాంధీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఆ సమయంలో ఏం జరిగిందో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది.




