Monday, 2 November 2026

అజాంనగర్ అటవీ ప్రాంతంలో దారుణం

– వేటగాళ్ల ఉచ్చుకు రైతు మృతి
– మాయమైన మృతదేహం!
– అటవీ ప్రాంతంలో అమర్చిన విద్యుత్‌ తీగలే ప్రాణం తీశాయా?
ట్రాక్టర్‌ డ్రైవర్లు తిరిగొచ్చేసరికి మృతదేహం అదృశ్యం
– గ్రామంలో కలకలం

జయశంకర్‌ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): భూపాలపల్లి మండలం అజాంనగర్ అటవీ ప్రాంతంలో దారుణం జరిగింది. అడవిలో పోడు భూమి సాగు కోసం రాత్రిపూట వెళ్లిన ఓ రైతు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు తెలిసింది. మృతదేహం కోసం అటు అటవీశాఖ సిబ్బంది, ఇటు గ్రామస్తులు అడవిలో జల్లెడ పడుతున్నారు. ఈ సంఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. అజంనగర్‌ గ్రామానికి చెందిన జడల అశోక్‌ (35) శుక్రవారం రాత్రి అజంనగర్‌–నిమ్మగూడెం మధ్యనున్న అటవీ ప్రాంతంలో పోడు భూమి సాగు కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వేటగాళ్లు వన్యప్రాణుల వేట కోసం అమర్చినట్లు భావిస్తున్న విద్యుత్‌ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం.

మృతదేహం ఏమైంది?

అశోక్‌ విద్యుత్‌ తీగలకు గురై మృతి చెందిన ఘటనను గమనించిన ట్రాక్టర్‌ డ్రైవర్లు గ్రామానికి వెళ్లి గ్రామస్తులకు సమాచారం అందించినట్లు తెలిసింది. అయితే గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే మృతదేహం కనిపించకుండా పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో అసలు అక్కడ ఏం జరిగింది? మృతదేహం ఎక్కడికి వెళ్లింది? దానిని ఎవరైనా తరలించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామం గ్రామస్తుల్లో ఆందోళనను మరింత పెంచింది.

విద్యుత్‌ తీగలు అమర్చిందెవరు?

అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట కోసం విద్యుత్‌ తీగలు అమర్చినట్లు వస్తున్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి తీగలు మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అశోక్‌ మృతికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? విద్యుత్‌ తీగలను ఎవరు అమర్చారు? మృతదేహం కనిపించకుండా పోవడానికి కారణమేంటి? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతదేహం ఆచూకీ, అధికారిక ధ్రువీకరణ ఇంకా తెలియాల్సి ఉంది.