హైదరాబాద్,మే4(జనం సాక్షి):పేదలు, రైతుల కోసం కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉందని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు కర్నాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వంటి రాష్టాల్రు అధిక ప్రాధాన్యమిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులతో బీమా చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇదివరకు ప్రకృతి వైపరీత్యాలతో 50 శాతం నష్టపోయిన పంటలకు మాత్రమే పరిహారం అందేదని, మోదీ ప్రధానిగా వచ్చాక 33 శాతం నష్టపోయినా పరిహారం అందించేలా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించడంలో భాజపా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.




