హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 23 జనంసాక్షి :
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారి అభివృద్ధికి పథకాలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానాన్ని కల్పిస్తున్నట్లు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్ జోన్ లోని జూబ్లీహిల్స్ సర్కిల్ లో సి.ఎం.టి.ఇ.సిలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ… 2017 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు బతుకమ్మ పండుగ చిరు కానుకగా 18 సంవత్సరాలు నిండిన మహిళలకు బతుకమ్మ చేరెలను పంపిణీ చేస్తున్నట్లు బీదలు కూడా బతుకమ్మను ఆనందోత్సవాలతో జరుపుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా చీరెలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు జరుపుకునే పండుగను మహిళలు సమిష్టిగా, సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. జిహెచ్ఎంసి పరిధిలో ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ చీరలు 1347 రేషన్ షాపుల అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ పండుగను మహిళలు తీరొక్క పువ్వులతో మహిళలు వాడవాడల్లో జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి,జిహెచ్ఎంసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.




