హైదరాబాద్,జూన్14(జనం సాక్షి): భవిష్యత్తు గురించి ముందుగా ప్రణాళికలు వేసుకుని పనిచేసే సామర్థ్యం చాలామందికి ఉండదు. ఎందుకంటే మనం వర్తమానానికి బందీలం. పక్కనేఉన్న ప్రమాదాలను, సంతోషాలను అధిగమించి పనిచెయ్యడం ఒక గొప్ప శక్తి. వెనక్కి తగ్గే స్వభావాన్ని విడిచిపెట్టాలి. కళ్లకు కనిపించేదానికన్నా భవిష్యత్తులో గొప్పవి జరగబోతున్నాయని ఊహించడం నేర్చుకోవాలి.సాధారణంగామనం తప్పులు చెయ్యడానికి కారణం- మన దగ్గరగా ఉన్న ప్రమాదాలకు భయపడటం, దూరంగాఉన్నప్రమాదాలను పట్టించుకోకపోవడం! వాటినిగాని మనం ముందుగా ఊహించి అంచనా వెయ్యగలిగితే చాలా పొరపాట్లు నివారించవచ్చు.ఒకవేళ అనుకోని ప్రమాదం ఏదైనా ఎదురైతే, దాన్ని తెలివిగా మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఆంజనేయుడి తోకకు రావణాసురుడు నిప్పుపెట్టాడు. లంకలో రాక్షసులంతా తెగ ఆనందపడిపోయారు, హనుమంతుడు కాలి బూడిదైపోతాడని. అలా జరగలేదు. లంకనే తన తోకతో తగలబెట్టాడు హనుమంతుడు. ప్రమాదాన్ని తనకు అవకాశంగా ఉపయోగించుకుని చరిత్రలో ఒక గొప్ప రసవత్తరమైన ఘట్టంగా మలిచాడు ఆయన.పనులు ప్రారంభించేటప్పుడు వ్యవహారం నడిపేది మనం. వాటిని ఒక పద్ధతిలో నడిపించేది మనమే. ఒకసారి అవి ప్రారంభమయ్యాక, చాలాసార్లు అవే మనకు దారి చూపిస్తాయి. మన లక్ష్యాన్ని నెరవేరుస్తాయి!
—-




