Tuesday, 3 November 2026

భారీ విజయం అందించాలి: రామలింగారెడ్డి

దుబ్బాక,మార్చి28(జ‌నంసాక్షి):  రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఏవైనా ప్రజల సంపూర్ణ మద్దతు టీఆర్‌ఎస్‌కే ఉంటుందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ఎంపి ఎన్నికల్లో కూడా ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు. వివిధ పార్టీల వారు టిఆర్‌ఎస్‌లో చేరిన సందర్బంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే రామలింగారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ టీడీపీల నుంచి పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాదరణ కోల్పోయిన కాంగ్రెస్‌ ఇక ఖాళీయేనని అన్నారు. రానున్న రోజుల్లో కేంద్రంలో టీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషిస్తుందని అందులో తామందరం మెదక్‌ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డిని మిగతా పార్లమెంట్‌ నియోజకవర్గాల కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించి ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చాటాలని అన్నారు. దుబ్బాక నియోజకవర్గాన్ని ప్రజలందరి సహకారంతో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుకోవడమే తన ముందున్న లక్ష్యమని ఆయన అన్నారు.