Tuesday, 3 November 2026

వేసవిలో పశువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం
హైదరాబాద్‌,మార్చి28(జ‌నంసాక్షి): పశుసంవర్ధకశాఖ కార్యదర్శి ఆదేశం మేరకు జిల్లాల్లో పశు సంవర్ధకశాఖ అధికారులు పశువుల సంరోణ చర్యలు చేపట్టారు. పశువులు, గొర్రెలు, మేకలను ఉదయం సాయంత్రం వేళ మాత్రమే మేపాలని సూచించారు. పశు పోషకులు గొర్రెల, మేకల పెంపకందారులు వేసవిలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అవి అనారోగ్యానికి గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా సంరక్షించుకోవచ్చనే అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలు, వాల్‌పోస్టర్లను పంపిణీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. పశువుల నీటి తొట్టెల్లో నీరు నిల్వ ఉండే విధంగా చూడాలని సూచించారు.
వేసవిలో ఎండ తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల వల్ల పాడిపశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు తీవ్ర అనారోగ్యానికి లోను కావటంతో పాటు వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా ముందస్తుగానే స్పందించి పశు సంవర్ధకశాఖ అధికారులను పశు వైద్యసిబ్బందిని అప్రమత్తం చేస్తోంది. ఇందులో భాగంగానే పశుసంవర్ధకశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా అన్ని జిల్లాల పశు సంవర్ధక శాఖ అధికారులకు పి/-పటికే తగు సూచనలు జారీచేశారు.  మూగజీవాల సంరక్షణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విషయాలపై పశువుల, గొర్రెల, మేకల పెంపకందారులకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని సూచించారు.  పశుగ్రాసం, తాగునీటి కొరత తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవల్సిందిగా ఆదేశించారు. మారుతున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా వాటిని శాస్త్రీయ యాజమాన్య పద్ధతిలో పెంచటం వల్ల వాటి ఉత్పాదక శక్తి తగ్గకుండా
రైతులు ఆశించిన ఫలితాలను పొందే అవకాశముంటుందని పేర్కొన్నారు.  వడదెబ్బకు గురైన పశువులు క్రమంగా నీరసించి, బలహీనంగా మారుతాయి. పశువులు సరిగా నడవలేక తూలుతూ పడుకోవటానికి ప్రయత్నిస్తాయి. జీవక్రియ తగ్గిపోవటం, ఆకలి మందలించటం, ఆహారం తక్కువగా తీసుకోవటం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఇతర వ్యాధులు, పరాన్నజీవులు ఆశించే అవకాశం ఎక్కువవుతుంది. కొన్ని సమయాల్లో దాహంతో ఉన్న పశువులు మురికి గుంటల్లో ఉన్న నీటిని తాగడంతో జీర్ణకోశ వ్యాధులు ప్రబలుతాయి.  వడదెబ్బకు గురైన వాటిలో దాహం పెరుగుతుంది. అందువల్ల సులువుగా జీర్ణించుకునే పిండి పదార్థాలైన గంజి, జావ లాంటి పదార్థాలు ఇవ్వటం మంచిదని అన్నారు.  పాలను ఇచ్చే పశువులకు పశుదాణా నీటితో కలిపి ఇవ్వాలి. మినరల్‌ మిక్చర్‌, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మంచిది. వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రదేశంలోకి తీసుకెళ్లి శరీర ఉష్ణోగ్రత తగ్గించటానికి పలుమార్లు నీటితో కడగడం, తల నుదుటి విూద మంచుముక్కలు ఉంచడం లేదా చల్లని గోనె సంచిని కప్పడం గానీ చేయాలన్నారు.