భార్యను చంపిన భర్త అరెస్ట్
మేడిపల్లి – జనంసాక్షి
మద్యానికి బానిసై అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చిన ఓ నిందితుడిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గొంతు నులిమి హత్య చేసినట్టు నిర్దారణ కావడంతో పోలీసులు రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పీర్జాదిగూడలోని శ్రీ రామనగర్ కు చెందిన గంధసిరి రవిచందర్ కు వరంగల్ కు చెందిన రాజ్యలక్ష్మి (34)తో 2009లో వివాహం జరిగింది. వారికి సుదీప్తి, శివసాయి సంతానం కలదు. పెళ్లి అనంతరం 2017 వరకు దంపతులు వరంగల్ లోనే ఉండగా.. 2018లో పీర్జాదిగూడలోని శ్రీ రామ నగర్ లో ఇల్లు కొనుక్కుని మొదటి అంతస్తులో ఉంటున్నారు. రాజ్యలక్ష్మి తల్లిదండ్రులు క్రింది పోర్షన్ లో ఉంటున్నారు. రవి చందర్ సెక్యూరిటి గార్డ్ గా పనిచేస్తున్న క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్యపై అనుమానం వ్యక్తం చేసేవాడు. శారీరకంగా, మానసికంగా ఆమె వేదించడంతో రవి చందర్ మీద డిసెంబర్ 2019లో వేధింపుల కేసు నమోదైంది. దీంతో ఓ ఏడాదిపాటు భార్యకు దూరంగా ఉంటున్నాడు. తర్వాత రాజీ ధోరణితో ఏడాది నుంచి కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15వ తేదీన ఉదయం పదిన్నర గంటల సమయంలో భార్యతో గొడవపడి, ఆమెను తీవ్రంగా కొట్టాడు. అనంతరం గొంతు చుట్టూ రెండు చేతులతో గట్టిగా నులిమి ఊపిరి ఆడకుండా చేయడంతో ఆమె ప్రాణం కోల్పోయింది. మృతురాలి తల్లి కన్యాకుమారికి స్పృహ తప్పి పడిపోయిందని చెప్పి నిందితుడు అక్కడినుంచి పారిపోయాడు. ఈ విషయంలో మేడిపల్లి పోలీసుల దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.