Monday, 2 November 2026

మతోన్మాద బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించాలి సిపిఎం

నాంపల్లి ఆగస్టు 31 ( జనం సాక్షి ) రాబోవు మునుగోడు ఉప ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం,చినపాక లక్ష్మీనారాయణ లు ప్రజలకు పిలుపునిచ్చారు.
      నాంపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి ప్రజల అసంతృప్తిని పక్కదారి పట్టించేందుకు మతోన్వాదాన్ని రెచ్చగొడుతూ ప్రజల మధ్య విద్వేషాలని రెచ్చగొడుతుందని విమర్శించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నిత్యవసర వస్తువుల ధరలు తగ్గిస్తామని, నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాని అకౌంట్లో 15 లక్షలు వేస్తామని, రైతాంగానికి మద్దతు ధరలు కల్పిస్తామని ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఎద్దేవ చేశారు.
       75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజల రెక్కల కష్టంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతుందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగబద్ధ సంస్థలైన ఈ డి, సిబిఐ, ఎన్ఐఏ, లను తమ జేబు సంస్థలు గా మార్చి ప్రతిపక్షాలపై దాడులకు ఉసుకూల్పుతోందని విమర్శించారు. పెరిగిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలతో పాటు నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్య ప్రజలు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నిరంకుశ నియంతృత్వ మతోన్మాద బిజెపిని మునుగోడు గడ్డ నుండి తరిమి తరిమి కొట్టాలని కోరారు.
      ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం నాంపల్లి, మర్రిగూడ మండల కార్యదర్శి లు నాంపల్లి చంద్రమౌళి ఏర్పుల యాదయ్య మండల నాయకులు వాష్పాక ముత్తిలింగం కొమ్ము లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.