మతోన్మాద బీజేపీని ఓడించడమే సీపీఐ లక్ష్యం
ప్రగతిశీల లౌకిక శక్తులంతా ఏకం కావాలి
– సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 22 : మతోన్మాద బీజేపీని ఓడించడమే లక్ష్యంగా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగిందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ స్పష్టం చేశారు. చేర్యాల పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో సోమవారం వారు కార్యకర్తలతో కలిసి మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసిందని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో ఆదాని, అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులకు అప్పనంగా అమ్మేస్తుందన్నారు. వస్తువులపై, తినుబండారాలపై జీఎస్టీ పలు రకాల పన్నుల భారం మోపడంతో పాటు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యవసర సరుకులు ధరలు విపరీతంగా పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. తెలంగాణలో అధికారం కోసం విద్వేష పూరితమైన రాజకీయాలను చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, మతోన్మాద బీజేపీని ఓడించడమే లక్ష్యంగా సీపీఐ ముందుకు సాగుతోందన్నారు. ప్రగతిశీల, లౌకిక శక్తులంతా ఏకమై బీజేపీని ఓడించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు ఈరి భూమయ్య, వలబోజు నర్సింహా చారి, పుల్లని వేణు, పల్లెమేని రవి యాదవ్, ఆత్మకూరి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.